జనగామ: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం నైపుణ్యాలను మరింత బలోపేతం చేసేందుకు 2026–27 విద్యా సంవత్సరంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను సమర్థంగా అభివృద్ధి చేసుకునేలా పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
నాలుగు సబ్జెక్టుల్లో ఎఫ్‌ఎల్‌ఎన్
తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, గణిత సబ్జెక్టుల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ తరగతికి నెలవారీ ఫోకస్ కంపిటెన్సీలను (ఎంఎఫ్‌సీఎస్)నిర్దేశించి వాటి ఆధారంగా బోధన కొనసాగించనున్నారు. అలాగే గణితం, తెలుగు, ఇంగ్లిష్ విషయాల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ఏఎక్స్‌ఎల్ సహాయక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వారానికి రెండుసార్లు, ఒక్కోసారి 20 నిమిషాల పాటు ప్రత్యేక అభ్యాస సెషన్లు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం సమర్థవంతమైన అమలుకు జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌సెల్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన టీచర్ హ్యాండ్‌బుక్స్, మైక్రో కంపిటెన్సీలు, బోధనా ప్రణాళికలను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేయడానికి జూలై 1 నుంచి 10 వరకు బేస్‌లైన్ అంచనా, నవంబర్ 20 నుంచి 30 వరకు మధ్యంతర అంచనా, 2027 మార్చి 7 నుంచి 17 వరకు తుది అంచనాలను నిర్వహించనున్నారు.
పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించాలి
ప్రతీ ఎఫ్‌ఎల్‌ఎన్ పాఠం అనంతరం విద్యార్థులు వర్క్‌షీట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు వెంటనే మూల్యాంకనం చేసి అవసరమైన విద్యా సహాయాన్ని అందించాలి. మల్టీ లెవల్ తరగతుల్లో టీచర్ సపోర్ట్ గ్రూపులు, పీర్ సపోర్ట్ గ్రూపుల ద్వారా పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
అదనపు శిక్షణ
విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక పరిహార బోధన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. ప్రతీ రోజు పాఠశాల అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్, గణితంలో అదనపు శిక్షణ ఇవ్వనున్నారు. డీఈఓ, ఎంఈఓలతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అకడమిక్ మానిటరింగ్ బృందాలు పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించనున్నాయి.
ప్రతీ నెల సమీక్ష సమావేశాలు
ప్రతీ నెల 20వ తేదీన పాఠశాల స్థాయి, 27న మండల స్థాయి, 28న జిల్లా స్థాయి, 29న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అదనంగా ప్రతీ రోజు కనీసం 30 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ నిర్వహించి విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించనున్నారు. మూడో తరగతి పూర్తయ్యే నాటికి ప్రతీ విద్యార్థి ప్రాథమిక పఠన, రచన, గణిత సామర్థ్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖ భావిస్తోంది.
ప్రాథమిక విద్య బలోపేతానికి
కొత్త కార్యాచరణ
చిన్నారుల అక్షరాస్యత,
సంఖ్యా పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి
ఎఫ్‌ఎల్‌ఎన్ కొనసాగించాలని విద్యాశాఖ ఆదేశాలు
ఏఐ ఆధారిత ఏఎక్స్‌ఎల్ సహాయం
నెలనెలా సమీక్షలతో ఎఫ్‌ఎల్‌ఏ
కార్యక్రమంపై నిఘా
ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాం సమాచారం
అంశం వివరాలు
తరగతులు 1 నుంచి 5వ తరగతి
అమలు చేసే సబ్జెక్టులు తెలుగు,ఉర్దూ, ఇంగ్లిష్, గణితం
ఫోకస్ విధానం నెలవారీ ఫోకస్ కంపిటెన్సీలు
ఏఎక్స్‌ఎల్ కార్యక్రమం వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత సహాయం
ఏఎక్స్‌ఎల్ సెషన్లు వారానికి 2 సార్లు, 20 నిమిషాలు
ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్‌లు జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో
బోధనా వనరులు ఎస్‌సీఈఆర్‌టీ టీచర్ హ్యాండ్‌బుక్స్
మల్టీ లెవల్ తరగతులు టీచర్, పీర్ సపోర్ట్ గ్రూపులు
పరిహార బోధన రోజూ సాయంత్రం 3–4 గంటల వరకు
పర్యవేక్షణ డీఈఓ, ఎంఈవీ, అకడమిక్ మానిటరింగ్ బృందాలు
లైబ్రరీ పీరియడ్ రోజూ కనీసం 30 నిమిషాలు
ప్రధాన లక్ష్యం 3వ తరగతి ముగిసే నాటికి పూర్తి అక్షరాస్యత


