21 రోజుల్లో నాటువేస్తే అధిక దిగుబడి
వానాకాలం సాగుకు సమయం అసన్నమైంది. అక్కడక్కడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏ పంట సాగుచేయాలో ఇప్పటికే రైతులు ఓ అంచనాకు వచ్చారు. జిల్లాలో వానాకాలం ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వేస్తుంటారు. ఎల్‌నినో ఏర్పడే అవకాశాలున్నందున రైతులకు పంటల సాగులో వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. లింగాల ఘణపురం మండల వ్యవసాయాధికారి ఎస్‌కే నజీరుద్దీన్, స్టేషన్‌ఘన్‌పూర్ ఏఓ సింగారపు కరుణాకర్, బచ్చన్నపేట ఏఓ శరత్‌చంద్ర సాక్షి ఇంటర్వ్యూలో వానాకాలం సాగుపై కీలకమైన సూచనలు, సలహాలు అందించారు.
–లింగాలఘణపురం,
స్టేషన్ ఘన్‌పూర్, బచ్చన్నపేట
వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధం
వరి, పత్తి, మొక్కజొన్న పంటలపై
వ్యవసాయాధికారుల సూచనలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో అన్నదాతలకు
అవగాహన
ప్రశ్న: ఖరీఫ్‌లో ఏ విధమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి?
జవాబు: తక్కువ కాలంలో పంట చేతికొచ్చే దొడ్డురకం ఐఆర్–64, ఎంటీయూ 1010, కేఎన్‌ఎం–118 సన్నరకాల్లో బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్, ఎహెచ్‌ఎంటీ, జైశ్రీరామ్, కేఎన్‌ఎం 1,638, వరంగల్ 44, వరంగల్ 962, జేజీఎల్ 1,798 రకాలు ఎంపిక చేసుకోవచ్చు.
ప్రశ్న: నారు పోసిన ఎన్ని రోజుల్లో నాట్లు వేసుకోవాలి?
జ: 21 రోజుల్లో నాట్లు వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. నెల రోజులు దాటకుండా వేసుకోవడం మంచిది.
ప్రశ్న: ఈసారి యూరియా పంపిణీ ఎలా
ఉంటుంది.?
జ: మొబైల్ యాప్‌తోనే అందజేస్తారు. ఎకరానికి రెండు బస్తాలను అందజేస్తారు. ఏ ఎరువులైన భవిష్యత్తులో ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటేనే అందజేస్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు చేయించుకోవాలి. ఎరువుల కొరత నేపథ్యంలో నానో యూరియా, నానో డీఏపీపై దృష్టి పెట్టాలి.
ప్రశ్న: చౌడు నేలల్లో వరి సాగుకు ఏ విధమైన పద్ధతులు అవలంబించాలి?
జ: జిప్సమ్ వేసుకొని నీటిని తొలగించే పద్ధతితో చౌడు తీసేయడం, జీలుగ, జనుము, పిల్లి పెసర వేసుకొని నెల రోజుల తర్వాత రోటవేటర్‌తో పొలంలోనే దున్ని నాట్లు వేస్తే మంచిది.
ప్రశ్న: ఎప్పటి వరకు వరి నాట్లు చేసుకోవాలి.?
జ: ఆగస్టు 15 వరకు నాట్లు వేసుకుంటే మంచిది. ఈసారి ఎల్‌నినో కారణంగా వర్షపాతం తక్కువగా ఉంటుందని అంటున్నారు. వరి సగానికి తగ్గించాలి. ఆరుతడి పంటలపై దృష్టి పెడితే మంచిది.


