తొలివానకే పత్తి విత్తనాలు పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

తొలివానకే పత్తి విత్తనాలు పెట్టొద్దు

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

ప్రశ్న: పత్తి రైతులు ఎప్పుడు విత్తనాలు వేసుకోవాలి?

జవాబు: పత్తి రైతులు తొందరపడి తొలి వానకే విత్తనాలు వేయవద్దు. రెండు, మూడు వర్షాలు పడేవరకు ఆగాలి. మొదటి వర్షంతో భూమిలోని వేడి వెళ్లిపోతుంది. తదుపరి వర్షం కురిసిన అనంతరం పత్తి విత్తనాలు వేయాలి. జూలై 15వ తేదీవరకు విత్తనాలు వేసుకోవచ్చు. వర్షాలు ఆలస్యం అయితే 50 మి.మీ కంటే ఎక్కువ వర్షం వచ్చిన తర్వాతనే విత్తనాలు వేయాలి. జూన్‌ చివరి వరకు వర్షాలు రాకపోతే మధ్యకాలిక రకాలను ఎంచుకోవాలి. జూలై తర్వాత ఆలస్యంగా విత్తడం తగ్గించాలి.

ప్ర: పత్తిపంట సాగుపై ఎల్‌నినో తుఫాన్‌ ప్రభావం ఉంటుందా?

జ: ఎల్‌నినో పరిస్థితుల్లో పత్తిసాగులో తేమ సంరక్షణ, హెచ్‌డీపీఎస్‌ పద్ధతి, సమతుల్య ఎరువుల వినియోగం, గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు పాటిస్తే తక్కువ వర్షపాతంలోనూ మంచి దిగుబడి సాధించవచ్చు.

ప్ర: పత్తి రైతులు ఏరకం విత్తనాలు ఎంచుకుంటే మంచిది?

జ: మధ్యకాలిక (130 నుంచి 150 రోజులు పంటకాలం ఉండే వైరెటీలు) బీటీ పత్తి హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవాలి. తక్కువ నీటిని తట్టుకునే రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ కాలం ఉండే హైబ్రిడ్లను నివారించాలి. మొక్కలు పెట్టే సాంద్రతను రెట్టింపుచేయాలి. సాధారణంగా పత్తి రైతులు ఎకరాకు 2 నుంచి 3 ప్యాకెట్ల విత్తనాలు వేస్తారు. అలా కాకుండా ఎకరాకు ఆరు ప్యాకెట్లను పెంచాలి. అంటే మొక్కకు మొక్కకు మధ్య దూరం తగ్గించి మొక్కల సాంద్రతను పెంచాలి. మొక్కల మధ్య దూరం 20 సెం.మీ, వరుసల మధ్య దూరం 90 సెం.మీ ఉండాలి. దాంతో పంట ఒకేసారి కాపునకు వస్తుంది. త్వరగా పంట అయిపోవడంతో గులాబీరంగు పురుగు సమస్య రాదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement