● పంటకు, నేలకు, మనుషులకు హానికరం
● వ్యవసాయ శాస్త్రవేత్త అనిల్ కుమార్
జనగామ: యూరియా అధికంగా వాడడం వల్ల పంటకు, నేలకు, మనుషులకు హానికరమని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ బి.అనిల్ కుమార్ హెచ్చరించారు. 46శాతం నత్రజని కలిగిన యూరియాను శాస్త్రవేత్తల సిఫారసు మేరకు మాత్రమే వాడాలని సూచించారు. గురువారం ఆయన ‘సాక్షి’కి వెల్లడించిన విషయాల ప్రకారం..
పంటపై దుష్ప్రభావాలు
● పంటకు పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువ అవుతుంది.
● మొక్కలు బలహీనపడి గాలికి, వర్షాలకు తట్టుకోలేక ఒరిగిపోతాయి. వరి వంటి పంటలు గాలికి త్వరగా పడిపోతాయి.
● మొక్కలు అధికంగా ఆకులు మాత్రమే పెంచి దిగుబడి, రుచి, నిల్వ సామర్థ్యం, మార్కెట్ నాణ్యత తగ్గుతుంది.
నేలపై ప్రభావం
● నేలలో జింక్, ఐరన్, సల్ఫర్ వంటి సూక్ష్మపోషకాల లోపం ఏర్పడి భూమి గట్టిపడి నీరు చొరబడే సామర్థ్యం తగ్గుతుంది.
● భూసారం క్రమంగా తగ్గి దీర్ఘకాలంలో భూమి చౌడు భూమిగా మారే ప్రమాదం ఉంది.
● నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి.
రైతుకు, ఆరోగ్యానికి నష్టం
●ఎరువుల ఖర్చు పెరిగి రైతుకు లాభం తగ్గుతుంది.
● పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లో నైట్రేట్ మోతాదు పెరిగి ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
● మనుషుల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం ఉంది.
ప్రత్యామ్నాయాలు
శాస్త్రవేత్తల సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలి. పచ్చిరొట్ట ఎరువులు, జీవామృతం, సేంద్రియ ఎరువులు, నేల పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం ఉత్తమం.
ఫాస్ఫరస్ (భాస్వరం) ప్రధాన ప్రయోజనాలు:
పంటల్లో వేర్ల పెరుగుదల నుంచి గింజల నాణ్యత వరకు ఫాస్ఫరస్ (భాస్వరం) కీలకపాత్ర పోషిస్తుంది. భాస్వరం వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను ఎన్నో ఉన్నాయి. ఫాస్ఫరస్ వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొక్కల వేర్ల వ్యవస్థ బలంగా, లోతుగా పెరిగేందుకు దోహదపడుతుంది. మొక్కల ప్రారంభ ఎదుగుదలకు సహాయపడుతుంది. నాటిన తొలిదశలో మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. పూత, పిందె ఏర్పాటును పెంచుతుంది. పంటలో పూత, పిందె ఎక్కువగా వచ్చే లా చేస్తుంది. గింజల నాణ్యత, దిగుబడిని మెరుగుపరుస్తుంది. గింజలు బాగా నిండి, నాణ్యతతో పాటు మొత్తం దిగుబడి పెరుగుతుంది. పంట త్వరగా పరిపక్వానికి రావడంలో సహాయపడుతుంది. పంట సకాలంలో కోతకు వస్తుంది. రైతులు నేల పరీక్ష ఆధారంగా, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ఫాస్ఫరస్ ఎరువులను వాడాలి.


