● పక్కాగా డ్రై డే నిర్వహించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యాధుల కేసులు పెరిగే అవకాశాలు ఉన్నందున ముందస్తు నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతీ గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించి, అనుమానిత కేసులను గుర్తించి వెంటనే వైద్యసేవలు అందించాలని తెలిపారు. దోమల పెరుగుదలను అరికట్టేందుకు ఫాగింగ్, ఆయిల్‌బాల్స్ వినియోగం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మల్లికార్జున రావు, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, డీఆర్డీఓ భాస్కర్, విద్యాశాఖ ఇన్‌చార్జ్ ఏడీ శ్రీనివాస్, ఇన్‌చార్జ్ డీపీఓ వెంకట్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి వన మహోత్సవం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వన మహోత్సవంపై వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మున్సిపల్ శాఖ, వివిధ సంక్షేమ శాఖలు వ్యవసాయ, విద్యా, తదితర శాఖల ఆధ్వర్యంలో మొత్తం 25,92,100 మొక్కలను నాటేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్డీఓ భాస్కర్, డీపీఓ వెంకట్ రెడ్డి, ఎకై ్సజ్ ఎస్పీ అనిత, ఎఫ్‌ఆర్‌ఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు
వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరైన 5,755 ఇళ్లకు గాను 87.5 శాతంతో 5,037 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి అయిందని తెలిపారు.


