ప్రతీ ఊరికి బస్సు వెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఊరికి బస్సు వెళ్లాలి

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

జిల్లా కేంద్రంలోని డిపోను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

బస్టాండ్‌ సౌకర్యాలు, కమర్షియల్‌

కాంప్లెంక్స్‌పై సమీక్ష

జనగామ: జిల్లా పరిధిలోని ప్రతీ గ్రామానికి ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులను నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జనగామ ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గురువారం పరిశీలించారు. డిపో మేనేజర్‌ ఉషతో కలిసి బస్టాండ్‌లోని ప్లాట్‌ఫారాలు, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, ఇటీవల నిర్మించిన నూతన ప్లాట్‌ఫారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గాయని ఓ మహిళ చెప్పగా, ఎండీ నాగిరెడ్డి ఆమెకు రెండు చేతులా నమస్కరించి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగామ డిపో పరిధిలో ప్రతి రోజూ సుమారు 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్‌ఫారాల విస్తరణ, అదనపు మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టామని, ఇంకా అవసరమైన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. పట్టణంలో ప్రస్తుతం ప్రత్యేక లోకల్‌ బస్సు అవసరం లేదని భావిస్తున్నామని, అవసరమైతే డిపో మేనేజర్‌ను సంప్రదించడం ద్వారా అదనపు బస్‌స్టాప్‌ల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం బస్టాండ్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ప్లాట్‌ఫారాల పరిస్థితి, బస్టాండ్‌ విస్తీర్ణం, ప్రవేశ మార్గాలు, భవిష్యత్తులో వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే అవకాశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బస్టాండ్‌లో ప్రస్తుతం 120 దుకాణాలు ఉన్నాయని అధికారులు ఎండీ దృష్టికి తీసుకు రాగా, కొత్త దుకాణాల నిర్మాణానికి హెడ్‌ ఆఫీస్‌ అనుమతి తప్పనిసరిగా అవసరమని సూచించారు. కాగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని సీఐ సత్యనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement