ఉద్యానం..ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఉద్యానం..ప్రోత్సాహం

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

ఎంఐడీహెచ్‌ కింద రైతులకు లక్షల రూపాయల సబ్సిడీ

మల్చింగ్‌ విధానంలో సాగు

జనగామ: జిల్లాలో ఉద్యానవన పంటల విస్తరణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌ (ఎంఐడీహెచ్‌) రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద మామిడి, నిమ్మ, అరటి, బొప్పాయి, డ్రాగన్‌ఫ్రూట్‌, అవకాడో వంటి తోటల సాగుతో పాటు డ్రిప్‌ ఇరిగేషన్‌, మల్చింగ్‌, తేనెటీగల పెంపకం, పందిరి కూరగాయల సాగు, నీటికుంటల ఏర్పాటుకు సబ్సిడీలు మంజూరు చేస్తున్నారు.

జిల్లాకు కేటాయింపులు

జిల్లాకు ఈ ఏడాది 30 హెక్టార్ల మామిడి, 10 హెక్టార్ల అరటి, 12 హెక్టార్ల బొప్పాయి, 5 హెక్టార్ల నిమ్మ, ఒక హెక్టారు డ్రాగన్‌ఫ్రూట్‌, ఒక హెక్టారు అవకాడో, 6 హెక్టార్ల ఉల్లిగడ్డ సాగు లక్ష్యాలు కేటాయించారు. మామిడి, నిమ్మ, జామ తోటలకు హెక్టారుకు రూ.48 వేల చొప్పున 50 శాతం సబ్సిడీ అందిస్తుండగా, అరటికి రూ.42 వేలు, బొప్పాయికి రూ.18 వేలు, డ్రాగన్‌ఫ్రూట్‌కు రూ.1.62 లక్షలు, అవకాడోకు రూ.30 వేల సబ్సిడీ అందనుంది. రైతులు ముందుగా పూర్తి ఖర్చుతో తోటలను ఏర్పాటు చేసుకుని, అనంతరం ధ్రువీకరణ పూర్తయ్యాక సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. పాసుబుక్‌ యూనిట్‌గా ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు ప్రయోజనం కల్పిస్తున్నారు. సబ్సిడీ కోసం పాసుబుక్‌, ఆధార్‌, ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలను ఉద్యానవన శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.

ముందుకొస్తున్న రైతులు..

జిల్లాలో ఇప్పటి వరకు డ్రిప్‌ కోసం 200 ఎకరాలకు దరఖాస్తులు రావడం రైతుల ఆసక్తిని సూచిస్తోంది. పంటల రక్షణతో పాటు అదనపు ఆదాయం కోసం వెదురు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మామిడి, నిమ్మ, అరటి తోటలు, మల్చింగ్‌, తేనెటీగల పెంపకం, ఫామ్‌పాండ్ల కోసం దరఖాస్తులు రావడంతో ఉద్యాన పంటల సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు వెల్లడిం చారు.

మామిడి నుంచి డ్రాగన్‌ ఫ్రూట్‌ వరకు

తోటల సాగుకు ప్రభుత్వ అండ

డ్రిప్‌, మల్చింగ్‌, తేనెటీగల పెంపకం, నీటి కుంటలకు రాయితీ

ఉద్యానవన శాఖ పథకాలపై పెరుగుతున్న ఆసక్తి

సద్వినియోగం చేసుకోండి

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌ ద్వారా రైతులకు అనేక రకాల సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న రైతులు తమ పాసుబుక్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యాన పంటల సాగు ద్వారా ఆదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలి. – రవికాంత్‌, జిల్లా ఉద్యానవన అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement