● పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జఫర్‌గఢ్: ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండలంలోని కోనాయిచలం రెవెన్యూ గ్రామ పరిధిలో దుర్గ్యనాయక్‌తండా సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో కలసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్ర స్థాయిలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వా రా 2,600 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించనున్నామన్నారు. ఈ పాఠశాలను బాలికలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


