నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

జనగామ: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆపరేషన్స్‌ డీజీపీ అనిల్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న మాంగల్య ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆపరేషన్స్‌ డీజీపీ అనిల్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి ప్రతీ ఏడాది సుమారు 3 శాతం మేర నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం సుమారు 8 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్‌, సీటుబెల్ట్‌లు ప్రాణాలను కాపాడే సాధనాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాటిని వినియోగించాలని సూచించారు. అతివేగం, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, మద్యం తాగి వాహనాలు నడపడం, డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసు శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, కట్టుదిట్టమైన అమలు చర్యల ఫలితంగా నాలుగైదు నెలలుగా ప్రమాదాల సంఖ్య తగ్గుతోందన్నారు. వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా విలువైనవని గుర్తుంచుకోవాలని సూచించారు.

వినూత్న అవగాహన

పోలీసు శాఖ నిర్వహించిన ‘అరైవ్‌ అలైవ్‌’ అవగాహన కార్యక్రమం ప్రజలను ఆలోచింపజేసింది. వీడియోలు, నాటక ప్రదర్శన, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఉత్తమ ఆర్టీసీ, పోలీసు డ్రైవర్లకు ఆపరేషన్స్‌ డీజీపీ అనిల్‌ కుమార్‌ చేతుల మీదుగా ప్రశంసపత్రాలు అందించారు. అలాగే లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు జైన్‌ రమేశ్‌, అఖిల భారత మార్వాడీ యువమంచ్‌ జనగామ శాఖ గీతేష్‌ బజాజ్‌ ఆద్వర్యంలో ఉచిత కళ్లద్దాలను ఆపరేషన్స్‌ డీజీపీ అనిల్‌ కుమార్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, డాక్టర్‌ కల్నల్‌ భిక్షపతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లికార్జున్‌ రావు, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, సీఐ సత్యనాయణరెడ్డి, వేణు, అబ్బయ్య గౌడ్‌, ఎస్సైలు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, యువకులు, యువజన సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమంలో అపరేషన్స్‌ డీజీపీ అనిల్‌ కుమార్‌

రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement