సొంత భవనాల్లేని పల్లె దవాఖానాలు | - | Sakshi
Sakshi News home page

సొంత భవనాల్లేని పల్లె దవాఖానాలు

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

లింగాలఘణపురం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యంపై అటు ప్రజాప్రతినిధులకు గాని ఇటు అధికారులకు గాని పట్టింపులేకుండా పోయింది. నిత్యం ప్రజలకు సేవ చేసే పల్లె దవాఖానాలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ఏళ్ల తరబడిగా పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. స్థలం అందుబాటులో ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే ఆ నిధులు మంజూరైనా బిల్లుల చెల్లింపు జాప్యం కారణంతో ఆ భవన నిర్మాణాల జోలికి కూడా వెళ్లడంలేదని తెలుస్తోంది. దీంతో అరకొర వసతుల నడుమ వైద్యసేవలు అందిస్తున్నారు.

2019లో ప్రారంభం..

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2019లో 5 వేల జనాభాకు ఒక(పల్లె దవాఖాన) ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్లుగా విస్తరించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందించేందుకు క్వాలిఫైడ్‌ వైద్యున్ని నియమించి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌, వృద్ధులకు బీపీ, షుగర్‌ వ్యాధుల మందుల పంపిణీ, వీటితో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి సేవలను అందిస్తున్నారు. ఇలా మండలంలో నాలుగైదు పల్లె దవాఖానలుగా మిగిలిన గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను కొనసాగిస్తూ మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు అనుసంధానం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 104 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 42 సబ్‌ సెంటర్లు, 62 పల్లె దవాఖానలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ భవనాలు కేవలం 21 మాత్రమే ఉండగా మిగిలిన 83 ప్రైవేట్‌ భవనాలు, దాతల ఇళ్లలో కొనసాగుతున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే పల్లె దవాఖానలు, ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలపై చిన్నచూపు ఏ విధంగా ఉందో తెలుస్తోంది.

బీపీ మందులు కరువు..

స్థానిక పీహెచ్‌సీలో సాధారణ బీపీ మందుల కొరత ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని రకాల కాంబినేషన్‌ బీపీ, షుగర్‌ మందులు అందుబాటులో ఉండడంలేదని రోగులు చెబుతున్నారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి ఉదయ్‌కిరణ్‌ను వివరణ కోరగా కొద్ది రోజులుగా కొన్ని రకాల బీపీ మందులు అందుబాటులో లేవని తాము పీహెచ్‌సీ నుంచి ఇండెంట్‌ పెడుతున్నా..అక్కడ లేకపోవడంతో పంపించడంలేదని, జిల్లాలోనే లేవని తెలిసిందని వివరించారు.

పాఠశాలలు, పంచాయితీ ఆఫీసుల్లో నిర్వహణ

అరకొర వసతుల మధ్య వైద్యం అందేదెలా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement