మహిళలే పవర్‌ ఓనర్లు! | - | Sakshi
Sakshi News home page

మహిళలే పవర్‌ ఓనర్లు!

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

రఘునాథపల్లి: జిల్లాలోని పాలకుర్తి మండలం వావిలాల, రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామాలు మహిళల ఆర్థిక సాధికారతకు ఆదర్శంగా నిలవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద సమాఖ్యల ఆధ్వర్యంలో ఒక మెగావాట్‌ సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అశ్వరావుపల్లిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టుకు గత నెల 27న భూమిపూజ చేయగా, వావిలాలలో నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన రంగంలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పర్యవేక్షణలో ఆ ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్వనిరెడ్డి, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా చొరవతో ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.

త్రైపాక్షిక ఒప్పందంతో ముందడుగు

ఈ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), టీజీ రెడ్కో, టీజీ డిస్కమ్‌ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 25 సంవత్సరాల కాల పరిమితితో ఈ ప్రాజెక్టులు కొనసాగనున్నాయి. రూ. 2.97 కోట్ల వ్యయంతో ఒక్కో ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 10 శాతం వాటాగా రూ.29.70లక్షలు మండల సమాఖ్య, చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్య సమకూర్చనున్నాయి. రాష్ట్ర పభుత్వం సబ్సిడీ రూపంలో రూ.కోటి రాయితీ అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని సెర్ప్‌ ద్వారా బ్యాంకు రుణంగా సమకూర్చనున్నారు.

మహిళలకు స్థిరమైన ఆదాయం

ఒక్కో ప్లాంట్‌ ద్వారా రోజుకు సుమారు 4 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఒక్క యూనిట్‌కు రూ.3.15 చొప్పున విక్రయించడం ద్వారా నెలకు రూ.4లక్షల చొప్పున ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు రుణాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించిన తర్వాత సంఘాలకు, సమాఖ్యలకు స్థిరమైన ఆదాయం వస్తుంది.

ఇందిరా మహిళా శక్తి పథకంలో

భాగంగా సోలార్‌ప్లాంట్లు

జిల్లాలో వావిలాల, అశ్వరావుపల్లిలో

ఏర్పాటు

కొనసాగుతున్న నిర్మాణ పనులు

ఒక్కో ప్లాంట్‌కు రూ.2.97 కోట్లు..

దీర్ఘకాలిక, స్థిర ఆదాయంతో

ఆర్థిక స్వావలంబన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement