4 సబ్‌స్టేషన్ల ప్రారంభం, 3 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన
జనగామ, జఫర్‌గఢ్, చిల్పూర్: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈనెల 9 (మంగళవారం) డిప్యూటీ సీఎం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవం, మరో 3 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ తదితరులు హాజరుకానున్నారు.
ప్రారంభం కానున్న సబ్‌స్టేషన్లు..
హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో రూ. 43.92 కోట్లతో నిర్మించిన 132/ 33కేవీ పీచర సబ్‌స్టేషన్ ద్వా రా వేలేరు, చిల్పూర్, ధర్మసాగర్ మండలాల్లోని 43,142 మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందనుంది. అంతేకాకుండా ఘన్‌పూర్, నర్మెట, ఎల్కుర్తి, వడ్డేపల్లి సబ్‌స్టేషన్లపై లోడ్ తగ్గనుంది. దీంతో పాటు చిల్పూర్ మండలం కొండాపూర్ 33/11 కేవీ, జఫర్‌గఢ్ మండలం సాగరం 33/11కేవీ, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి 33/ 11కేవీ సబ్‌స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ 4 సబ్‌స్టేషన్ల ద్వారా 7,832 మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
శంకుస్థాపన చేయనున్న సబ్‌స్టేషన్లు..
చిల్పూర్ మండలంలోని లింగంపల్లి రూ.2.81 కోట్లు, పల్లగుట్ట రూ.3.25 కోట్లు, నష్కల్ రూ.3.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మూడు 33/11కేవీ సబ్‌స్టేషన్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వీటి ద్వారా లింగంపల్లి, కొండాపూర్, శ్రీపతిపల్లి, మల్కాపూర్, కృష్ణాజి గూడెం, తాటికొండ, వంగాలపల్లి, నష్కల్ సహా 9,864 మంది వినియోగదారులకు లో ఓల్టేజీ సమస్య తీరనుంది. నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసేందుకు మొత్తం రూ.60.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


