చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట గ్రామానికి మంగళవారం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క రానున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. పల్లగుట్ట గ్రామంలో సోమవారం ఉదయం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, ఘన్‌పూర్ ఆపరేషన్ ఏడీఈ రణధీర్‌రెడ్డి, చిల్పూరు ఏఈ సురేష్ తదితర అధికారులతో కలిసి ఆయన సభాస్థలిని పరిశీలించారు. అనంతరం కడియం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.60.62 కోట్ల విలువైన నాలుగు సబ్ స్టేషన్‌ల ప్రారంభం, 3 సబ్ స్టేషన్‌లకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కాగా, నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో ఇళ్లపై నుంచి 33/11 కేవీ లైన్‌లు వెళ్లాయని ఈవిషయంలో గృహ యజమానులు ట్రాన్స్‌కో వారిని అడిగితే లైన్ షిఫ్టింగ్‌కు జీపీ నుంచి డబ్బులు చెల్లిస్తే సరిచేస్తామన్నారని ఆ సమస్యతో పాటు, రఘునాథపల్లి మండల కేంద్రంలో ఉన్న 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను 220/132 కేవీ సబ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తే 7 మండలాల్లో విద్యుత్ సమస్య ఉండదని దీన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీదర్‌రావు, పల్లగుట్ట గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, శాతబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.


