ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన ఎంసీహెచ్
తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జిల్లాలోని లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్‌శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు.
జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది.
అమ్మగా మారిన ఎస్‌ఎన్‌సీయూ
పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్‌ఎన్‌సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు.
తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి..
50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.
శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది
నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం
సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి
రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది
50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు


