‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే.. | - | Sakshi
Sakshi News home page

‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..

బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. ఉమ్మడి వరంగల్‌ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్‌ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్‌ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు పాత ములుగు, జేఎస్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్‌చార్జ్‌ గా ఉన్న జనగామ, వరంగల్‌, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

ధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్‌ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్‌ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్‌ సభ్యత్వ సేకరణకు ఇన్‌చార్జ్‌ లను నియమించారు.

సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్‌చార్జ్‌లు..

పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్‌ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లో భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు గతంలోనూ ఇన్‌చార్జ్‌గా ఉన్న ములుగు, జేఎస్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్‌చార్జ్‌గా ఉన్న జనగామ, వరంగల్‌, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవిందర్‌రావును ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మేడ్చల్‌–మల్కాజిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్‌ను గద్వాల్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.

గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్‌

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్‌వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్‌ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

పల్లా రాజేశ్వర్‌రెడ్డి

సత్యవతిరాథోడ్‌

Advertisement
 
Advertisement
Advertisement