జనగామ: జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 12 రోజులుగా కొనసాగుతున్న జరిగిన హిందూ బాలసంస్కార శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త మోహన కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 115 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వహిందూ పరిషత్ విభాగ్ సంఘటన మంత్రి శివరాములు హాజరు కాగా మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ.. పన్నెండు రోజుల శిక్షణకు అద్భుత స్పందన వచ్చిందన్నారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంస పత్రాలు, హనుమాన్ చాలీసా పుసకాలు, మెటీరియల్, బాక్సులు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన గౌరవాధ్యక్షుడు గజ్జెల నర్సిరెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల భిక్షపతి, ప్రముఖ వైద్యులు గోపీచంద్, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్ పాల్గొన్నారు.
డీఆర్డీఓగా భాస్కర్
జనగామ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఓ)గా రాపర్తి భాస్కర్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న భాస్కర్ డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొందగా, డీఆర్డీఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన జనగామ జిల్లా డీఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా వి.వెంకయ్య పదోన్నతిపై ఇక్కడకు రాగా, బాధ్యతలను స్వీకరించారు.
హైకోర్టు ఆదేశాల మేరకే తొలగింపు
జనగామ: ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా కొనసాగిస్తున్న టీస్టాల్‌పై చేపట్టిన చర్యలను తెలంగాణ హైకోర్టు సమర్థించినట్లు డీపీఆర్వో పల్లవి వెల్లడించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. టీ స్టాల్‌కు సంబంధించిన తాత్కాలిక ఉత్తర్వులను కోర్టు రద్దు చేసి, వార్డు–17లోని వెజ్–నాన్ వెజ్ మార్కెట్ సమీపంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని తాత్కాలిక లైసెన్సుతో కేటాయించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. వాస్తుపేరుతో తొలగింపు ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే భూరికార్డుల కార్యాలయంలో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు అధికారుల అనుమతిలేకుండా ల్యాప్‌టా ప్, ప్రింటర్ ఉపయోగించి భూ రికార్డులు కలర్ ప్రింట్లు తీస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, పరిపాలనా చర్యలు ప్రారంభించగా, క్రిమినల్ చర్యలకు సంబంధించి పరిశీల న కొనసాగుతుందన్నారు. కాగా కలెక్టరేట్ ప్రాంగణంలో సుమారు 80 క్లెయిమ్ చేయని వాహనాలను గుర్తించగా, అగ్ని ప్రమాదం, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసు, ఆర్టీఏ శాఖల సహకారంతో వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధమై న విమర్శలను స్వాగతిస్తున్నామని, అయితే విమర్శలు వాస్తవాలపై ఆధారపడాలన్నారు. నమోదైన పాలనా చర్యలను నిరంకుశంగా అభివర్ణించడం వాస్తవాలకు విరుద్ధమని, హైకోర్టు ధ్రువీకరణ తమ పారదర్శక చర్యలకు నిదర్శనమని స్పష్టం చేశారు.


