జనగామ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేవరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే అన్‌లోడింగ్, మిల్లులకు తరలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇన్‌చార్జ్ డీసీఎస్‌ఓ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు నమోదు చేయాలి
లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ (ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్ సిస్టమ్) నమోదు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు పడేవిధంగా చూడాలని కలె క్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. మండలంలోని కుందారంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
కొనుగోళ్లను వేగవంతం చేయాలి..
స్టేషన్‌ఘన్‌పూర్/పాలకుర్తిటౌన్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను సక్రమంగా, వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి, పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను, అయ్యంగారిపల్లి, గూడూరు, దేవరుప్పల మండలం కోలుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు..
జిల్లాలోని మొక్కజొన్న కొనుగోళ్లలో ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, అవసరానికి అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మొక్కజొన్న కొనుగోలు, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వేరు వేరుగా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి సమీక్ష నిర్వహించా రు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, ఆత్మ డీపీడీ విజయశ్రీ, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్‌డీఓ నూరొద్దీన్, ఏఎంవీఐ శ్వేత, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో
రైతులు ఇబ్బందులు పడొద్దు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం


