మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే తీర్మానం | - | Sakshi
Sakshi News home page

మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే తీర్మానం

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

జనగామ: పురపాలికలో వాయిదా తర్వాత ఇటీవల జరిగిన సాధారణ సమావేశంలో మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే ఎజెండా తీర్మానం పొందినట్లు కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ‘మేం రాకముందే ఎజెండా ఎలా ఆమోదించారు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏప్రిల్‌ 30వ తేదీన జరిగిన సాధారణ సమావేశం వాయిదా పడగా, తిరిగి మే 6వ తేదీన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మూడు వంతుల సభ్యులు హాజరవడంతో 54 ఎజెండా అంశాలను చైర్‌పర్సన్‌ ముందుంచగా, కాంగ్రెస్‌కు చెందిన 9 మంది, బీఆర్‌ఎస్‌ సభ్యులు ముగ్గురు హాజరయ్యారన్నారు. మూడొంతుల కోరం ఉండడంతో ఎజెండా చదివే సమయంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఉడుగుల కిష్టయ్య అభ్యంతరం వ్యక్తం చేయగా, మెజార్టీ కౌన్సిలర్ల అంగీకారంతోనే ఆమోదించడం జరిగిందన్నారు. ఈలోగా ఆలస్యంగా వచ్చిన మరికొంతమంది బీఆర్‌ఎస్‌ సభ్యులు తమ రాకముందే ఎజెండా ఆమోదించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను కావాలనే త్వరగా ఆమోదించారని వారు ఆరోపించగా, సమావేశం ఉంటుందని మూడు రోజుల ముందే నోటీసులు ఇచ్చినట్లు చైర్‌పర్సన్‌ స్పష్టం చేసినట్లు తెలిపారు.

ఎజెండాలో ఎలాంటి దుర్వినియోగం లేదు: మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
 
Advertisement
Advertisement