కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై భారీ బాదుడు
జనగామ: కమర్షియల్ సిలిండర్ ధర పెంపు హోటళ్ల నిర్వహణను తలకిందులు చేస్తోంది. వరుసగా పెరుగుతున్న ధరలు చిన్న వ్యాపారులపై పెనుభారం మోపుతున్నాయి. దీంతో చాలా మంది కట్టెల పొయ్యిపైనే హోటళ్లు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్‌పై కొద్ది రోజుల క్రితం రూ.412 పెంపు చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో రూ.839 మేర పెంచింది. దీంతో కేవలం కొన్ని నెలల్లోనే ఒక్క సిలిండర్‌పై పెంపు రూ.1,251కి చేరింది. దీంతో సిలిండర్ ధర రూ.3, 219కి చేరి వ్యాపారులకు తీవ్రమైన ఆర్థిక భారంగా మారింది. జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, అధికారికంగా 500కు పైగా కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 800 వరకు అనధికారిక కనెక్షన్లు ఉన్నట్లు అంచనా.
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, గప్‌చుప్ బండ్లు, చిన్న హోటళ్లు, తినుబండారాల దుకాణాలు ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడతాయి. నెలకు నాలుగు నుంచి ఐదు సిలిండర్లు వినియోగించే చిన్న హోటళ్లకు కొత్త ధరల ప్రకారం ప్రతీ నెల కనీసం రూ.5వేల వరకు అదనపు వ్యయం తప్పదు. ఇప్పటికే భవన అద్దెలు, సిబ్బంది వేతనాలు, కూరగాయలు, నూనెలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా కమర్షియల్ గ్యాస్ ధరల భారీ పెంపు వారిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. వ్యాపారం కొనసాగించడమే పెద్ద సవాలుగా మారిందని, ప్రభుత్వ సహాయం లేకుంటే చిరు వ్యాపారరంగం తీవ్రమైన దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడంతో టిఫిన్లు, ఇతర తినుబండారాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లు అదనంగా గ్యాస్ ధరలను జోడించి కస్టమర్ల వద్ద బిల్లులు వసూలు చేస్తున్నాయి. సామాన్య కుటుంబాలపై సైతం ధరల ప్రభావం పడనుంది.
చిరు హోటళ్ల యజమానులపై
ఆర్థిక భారం
నెలకు రూ.5వేలకు పైగా
అదనపు భారం
కొద్ది నెలల్లోనే సిలిండర్‌పై
రూ.1,251 పెంపు


