ఉన్నతాధికారులకు
రిపోర్టులు–పరిష్కారం ఎప్పటికీ?
2.0 వెర్షన్‌లో సాంకేతిక లోపం
జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఈ–నామ్ 2.0 వెర్షన్ అమలు ప్రారంభ దశలోనే సాంకేతిక సమస్య తలనొప్పిగా మారింది. రైతులు, ట్రేడర్లకు పారదర్శకత, సమయపాలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ–నామ్ సేవలను పూర్తిస్థాయిలో 2.0 వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతనెలలో నిర్వహించిన ట్రయల్ రన్‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ఈ నెల ప్రారంభం నుంచి సేవలు పూర్తిస్థాయిలో అమలవడంతో అసలు సమస్యలు బయటపడుతున్నాయి.
యాప్ ఓపెన్ కాక ట్రేడర్లకు ఇబ్బందులు
వ్యవసాయ మార్కెట్‌లో 37 మంది అడ్తి వ్యాపారులు, 54 మంది ట్రేడర్లు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసేందుకు రోజువారీగా ఐదుగురు, మక్కల కొనుగోలు కోసం నలుగురు ట్రేడర్లు మాత్రమే వస్తున్నారు. ప్రతీరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు బిడ్డింగ్ జరుగుతోంది. ట్రేడర్లు సరుకులకు ధరలు వేసే సమయంలో మాన్యువల్ పద్ధతిలో టెండర్ బాక్స్‌లో వేస్తుండడంతో అరగంట ఆలస్యమవుతోంది. పంట ఉత్పత్తుల లాట్ నెంబర్ సెలక్షన్ సమయంలో యాప్ సేవలు బాగున్నప్పటికీ, ట్రేడర్ల మొబైల్ ఫోన్లలో యాప్ ఓపెన్ కాకపోవడం వంటి సాంకేతిక లోపాలు వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేశాయి. దీంతో ట్రేడర్లు అధికారికంగా ధరలు నమోదు చేయలేని పరిస్థితి. డిజిటల్ కొనుగోలు నడిచే ఈ–నామ్ వ్యవస్థలో ఈ లోపం మార్కెట్ కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది.
ధరల గోప్యత కోసం టెండర్ బాక్స్
అధికారులు మార్కెట్‌లో సరుకు నాణ్యతను పరిశీలించి ఈ–నామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నప్పటికీ, ధరల ఎంట్రీ వద్ద ట్రేడర్ల మొబైల్ ఫోన్‌లో యాప్ ఓపెన్ కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా టెండర్ బాక్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రేడర్లు తమ ధరల వివరాలను రహస్యంగా కాగితంపై రాసి ఈ బాక్స్‌లో వేస్తున్నారు. తర్వాత అధికారులు వాటిని సేకరించి కంప్యూటర్ల ద్వారా తమ కంప్యూటర్ల ద్వారా ఈ–నామ్ పోర్టల్‌లో మాన్యువల్‌గా నమోదు చేస్తున్నారు. డిజిటల్ వ్యవస్థకు బదులుగా మళ్లీ పాత పద్ధతి అ మలవుతుండడంతో కొంత ఇబ్బంది తప్పడం లేదు.
యాసంగి కోతలతో భారీ రాక
యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్ రోజుకు 6 వేల నుంచి 8 వేల బస్తాల వరకు ధాన్యం వస్తోంది. అదే స్థాయిలో మక్కలతో పాటు ఇతర పంట ఉత్పత్తులు సైతం వస్తున్నాయి. మార్కెట్‌కు సరుకులు పోటెత్తుతున్న సమయంలో ఈ–నామ్ సమస్యలు మరింతగా ఇబ్బందులు పెడుతున్నాయి. కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం, ధరల నిర్ణయంలో అయోమయం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. మార్కెట్‌కు బుధవారం ఒక్కరోజే 117 మంది రైతుల వద్ద 4,540 బ్యాగుల ధాన్యం, 2,320 బస్తాల మక్కలను కొనుగోలు చేశారు.
స్థానిక అధికారులు ప్రతిరోజూ సాంకేతిక సమస్యల వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. అయితే 15 రోజులుగా స మస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు, ట్రేడర్లకు ఇబ్బంది తప్పడం లేదు. ఈ–నా మ్ 2.0 వల్ల పారదర్శకత పెరుగుతుంది.. కానీ ప్రస్తుతం చిన్న సాంకేతిక సమస్యపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అంజిత్‌రావు తెలిపారు. త్వరలోనే ఈ సమస్యను అధికమించి వందశాతం ఈ–నామ్ దిశగా ముందుకెళ్తామన్నారు.
15 రోజులుగా పనిచేయని ట్రేడర్ల యాప్
ధరల గోప్యత కోసం ప్రత్యేకంగా టెండర్ బాక్స్
సాంకేతిక సమస్యలపై ఉన్నతాధికారులకు సమాచారం


