
గజాననుడు
కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు.