
‘భూ భారతి’పై అవగాహన అవసరం
జనగామ రూరల్: ‘భూ భారతి’ చట్టంపై రైతులకు అవగాహన అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం పట్టణంలోని గాయత్రి గార్డెన్‌లో ఈ చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహ న సదస్సులో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి మాట్లాడారు. ధరణిలో అప్పీల్ వ్యవస్థ లేక కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, భూభారతి చట్టంలోని అప్పీల్ వ్యవస్థ ద్వారా జిల్లా పరిధిలోనే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ధరణిలో ప్రతీ దరఖాస్తు కలెక్టర్ వద్దకు వచ్చేదని, ఇప్పుడు అలా కాకుండా తహసీల్దార్, ఆర్డీఓ వద్దే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. మే చివరి నాటికి ప్రతీ గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. సదస్సులో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ హుస్సేన్, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం జనగామ మండల పరిధి వడ్లకొండ, శామీర్‌పేట్‌లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులకు విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం పట్టణంలోని 14వ వార్డులో జరుగుతున్న అబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని వెరిఫికేషన్ టీంకు సూచించారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా