
యూడైస్ వెరిఫికేషన్
జనగామ: జాతీయ సమాచార కేంద్రం పర్యవేక్షణలో యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) ద్వారా పాఠశాలల డేటా బేస్‌ను సేకరించేందుకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల పరిధిలో మౌలిక వసతులతోపాటు మరో 30 అంశాలకు సంబంధించి డేటాబేస్‌ను అభివృద్ధి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సమగ్ర సమాచారాన్ని యూడైస్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఆన్‌లైన్‌లో పొందుపరిచిన వివరాలు క్షేత్రస్థాయిలో సరిపోల్చే విధంగా ఉన్నాయా.. లేదా..? తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే పేరిట థర్డ్ పార్టీ వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి డీఈడీ, బీఈడీ ట్రెయినీ విద్యార్థులతో నిర్వహిస్తున్న థర్డ్ పార్టీ వెరిఫికేషన్ నేటి (సోమవారం)తో ముగియనుంది.
పడిపోయిన ర్యాంక్ !
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. సర్కారు బడుల్లో కనీస మౌలిక వసతి సౌకర్యాలను మెరుగుపర్చడంతోపాటు సాంకేతికత ఆధారంగా డిజిటల్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, కంప్యూటర్లు, ల్యాబ్స్, విద్యుత్ సౌకర్యం, సోలార్ ప్యానెల్స్, ఫర్నిచర్, ప్లే గ్రౌండ్, చేతులను శుభ్రం చేసుకునే వసతి, విద్యార్థుల వారీగా ఆరోగ్య రికార్డులు, కిచెన్ గార్డెన్లు, ఇంటర్నెట్, కిచెన్‌షెడ్లు, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్స్, వసతి సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయనే దానిపై యూడైస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థుల సమగ్ర సమాచారంతోపాటు కేంద్రం ఇచ్చిన ఫార్మెట్ ప్రకారం కనీస మౌలిక వసతి సౌకర్యాల వివరాలను అందులో పొందుపరిచారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి ఇచ్చిన యూడైస్ సమాచారంలో క్లారిటీ లేకపోవడంతో దేశంలో తెలంగాణ ర్యాంకు పడిపోయింది. దీంతో కేంద్రం నుంచి విద్యాభివృద్ధి కోసం రావాల్సిన నిధుల వాటా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈక్రమంలో మేల్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం యూడైస్ సర్వేను థర్డ్ పార్టీ ద్వారా మరోసారి వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుని, అమలు చేస్తోంది.
వివరాల పునఃపరిశీలన
జిల్లాలో ఐదు యాజమాన్యాల (స్థానిక సంస్థలు, ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్, టీఆర్‌ఐఈఎస్, యూఆర్‌ఎస్) పరిధిలో 460 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ బడుల పరిధిలో ఆన్‌లైన్‌లో పొందుపరిచిన యూడైస్ వివరాలను క్రాస్ చెక్ చేసుకునేందుకు 43 మంది డీఈడీ, బీఈడీ ట్రేయినీ విద్యార్థుల ద్వారా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. ఒక్కో విద్యార్థి రోజుకు రెండు నుంచి మూడు పాఠశాలల్లో సర్వే చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసిన 30 అంశాల సమాచారం సరిగ్గా ఉందా.. లేదా.. అనే కోణంలో పరిశీలన చేసి, తుది నివేదికను విద్యాశాఖ ఉన్నతాధికారులకు అందించనున్నారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం వివరాలను ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో సరి చేయనున్నారు.
సర్వే కొనసాగుతోంది
జిల్లాలోని 460 సర్కారు బడుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల పరిధిలో కనీస సౌకర్యాలతోపాటు మరో 30 అంశాలకు సంబంధించి యూడైస్ డేటాబేస్‌పై థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కొనసాగుతోంది. పాఠశాలల వారీగా ఆన్‌లైన్ చేసిన వివరాలు, క్షేత్రస్థాయిలో సరిపోల్చే విధంగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు సర్వే ఉపయోగపడుతుంది. సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య పెరుగుదల ఉంటే యూడైస్‌లో నమోదు చేస్తారు.
– తోట రాజు, సమగ్ర శిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటర్
సర్కారు పాఠశాలల్లో
థర్డ్ పార్టీ పరిశీలన
నేటితో ముగియనున్న సర్వే
460 పాఠశాలలు..
43 మంది డీఈడీ, బీఈడీ విద్యార్థులు