
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నారు. అందుకు హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు జిల్లాల్లో మొత్తం టెన్త్ విద్యార్థులు 2,679 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,707 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 35 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించారు. 9 ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలు, 35 సిట్టింగ్ స్కా్‌వ్డ్ల బృందాలను ఏర్పాటు చేశారు. 418 మంది ఇన్విజిలేటర్లుగా విధులను నిర్వర్తించనున్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రత్యేక సబ్జెక్టులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ అనగొని సదానందం శుక్రవారం తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 80084 03631, 93460 20003 సంప్రదించాలని వారు సూచించారు.
ఉమ్మడి జిల్లాలో టెన్త్‌లో 2,679 మంది
ఇంటర్‌లో 4,707 మంది విద్యార్థులు