కనీస వైద్య సదుపాయాలూ కరువే.. నివాసముంటేనే ఇళ్లంటూ నోటీసులు లేకుంటే రద్దు చేస్తామంటూ ఆదేశాలు ‘డబుల్ బెడ్రూం’ లబ్ధిదారుల్లో ఆందోళన సౌకర్యాలు కల్పించాలంటూ వేడుకోలు
జగిత్యాల: జిల్లాకేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూకపల్లి శివారులో గతంలోనే 4,520 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. ఇందులో 4,200 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. అయితే చాలామంది లబ్ధిదారులు అక్కడకు వెళ్లి కేటాయించిన ఇళ్లల్లో ఉండడం లేదు. ఉపాధి కోసం కొందరు.. పిల్లల చదువుల కోసం మరికొందరు జిల్లాకేంద్రంలోనే అద్దె ఇళ్లల్లో ఉంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. లబ్ధిదారులు ఇళ్లల్లో ఉండడం లేదన్న విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులు డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో ఉండకుంటే రద్దు చేస్తామని ప్రకటన జారీ చేశారు. అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేయొచ్చని, ఆ సమయంలో ఇళ్లలో లేకుంటే రద్దు చేస్తామని, ఇక మరోసారి అవకాశం కల్పించబోమని నోటీసులు అంటించారు. దీంతో డబుల్‌బెడ్‌రూం పొందిన లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. కాలనీలో కనీస సౌకర్యాలు లేవని, అక్కడ ఎలా ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ సమస్యలే..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నూకపల్లిలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ ఇక్కడ అన్నీ సమస్యలే నెలకొన్నాయి. ముఖ్యంగా డంపింగ్‌యార్డు కాలనీ సమీపంలోనే ఉంది. ఇందులో నిత్యం మంటలు లేస్తున్నాయి. పొగతో కాలనీవాసులు కాలుష్యం బారిన పడుతున్నారు. సమస్య తీర్చాలని ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారు లేరు. అలాగే శ్మశాన వాటిక లేకపోవడంతో ఎవరైనా చనిపోతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాలనీ జిల్లాకేంద్రానికి పది కిలోమీటర్ల దూరం ఉన్నా.. కనీసం బస్సు సౌకర్యం కల్పించలేదు. కాలనీలో ఉన్న వారంతా చిరువ్యాపారులే. వీరంతా ప్రతిరోజూ జిల్లాకేంద్రంలోనే వ్యాపారాలు చేసుకుంటారు. కాలనీ నుంచి వెళ్లి రావాలంటే అదనపు ఖర్చవుతుందని భావించి పట్టణంలోనే అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. కాలనీలో స్కూల్ ఏర్పాటు చేసినప్పటికీ ఐదో తరగతి వరకే ఉంది. పదో తరగతి వరకు చదివే విద్యార్థులు మళ్లీ జగిత్యాలకే వెళ్లాల్సి వస్తోంది. డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో ఉంటే పట్టణంలో ఉండేదానికంటే ఎక్కువ ఖర్చు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోడ్లు సక్రమంగా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. నీరు కూడా సక్రమంగా రావడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్యను పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. తాజాగా ఇళ్లల్లో ఉండాల్సిందేనంటూ ప్రకటన జారీ చేయడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో 1250 విద్యుత్ స్తంభాలు వేసినా.. కేవలం 250 స్తంభాలకు మాత్రమే వీధి లైట్లు పెట్టారని, మిగిలిన కాలనీ చీకటిమయంగా ఉంటోందని పేర్కొంటున్నారు. ఇటీవల కాలనీని మున్సిపాలిటీలో విలీనం చేసినా.. చెత్త సేకరణ వాహనాలు రావడం లేదంటున్నారు. ఆస్పత్రిని చిన్న రూమ్‌లో ఏర్పాటు చేశారని, అది ఉన్నా లేనట్లేనని పేర్కొంటున్నారు. ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రయితే భయంగా ఉందని, కనీసం రక్షణ కూడా లేదని చెబుతున్నారు.
కాలనీలో శ్మశాన వాటిక లేదు. 4200 ఇళ్లు ఉన్న ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. డంపింగ్‌యార్డుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త సేకరణకు వాహనాలు రావడం లేదు. వీధి దీపాలు వెలగడంలేదు. సమస్యలు పరిష్కరించాక లబ్ధిదారులు ఉండకుంటే అప్పుడు రద్దు చేస్తామని ప్రకటన ఇవ్వాలి. – రాజు, అర్బన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్
అధ్యక్షుడు
శ్మశాన
వాటిక లేదు
సౌకర్యాలు ఏర్పాటు చేయాలి
అధికారులు స్పందించి కాలనీలో సౌకర్యాలు కల్పించాలని, అనేక సమస్యలు ఉండటంతోనే ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. పేద ఇళ్ల కల నెరవేరుస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఇచ్చిన ఇళ్లను తీసుకుంటామని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. కొంత మంది విధిలేని పరిస్థితుల్లో ఇక్కడే ఉంటున్నారని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.


