కోరుట్ల: వారసత్వ సంపదగా కోరుట్లకు చెందాలన్న డిమాండ్ కొనసాగుతున్న కోట బురుజుల స్థలంపై కీలక నేతలకు చిత్తశుద్ధి కరువైంది. రూ.10 కోట్ల విలువైన గడి బురుజుల స్థలానికి నిబంధనలకు విరుద్ధంగా వెకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్‌టీ) కేటాయించారన్న అంశం స్పష్టమవుతున్నా.. సదరు వీఎల్‌టీని రద్దు చేయించడంలో నేతలంతా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఉదాసీనత వెనక ‘కాసుల బేరాలే..’ కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. కంటి తుడుపు చర్యలతో కోరుట్ల మున్సిపాలిటీకి చెందిన కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు..‘నవ్విపోదురుగాకా మాకేటి’..అన్న చందంగా ఉంది.
నిబంధనలు బేఖాతర్..
కోరుట్ల కోట బురుజుల సమీపంలో ఉన్న సుమారు మూడెకరాల స్థలంలో వెకెంట్ ల్యాండ్ టాక్స్ వేసిన తీరు పూర్తిగా నిబంధనలను విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కోరుట్ల అఖిల పక్షాల నేతలు సుమారు ఆరు నెలల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సామాన్యులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా వీఎల్‌టీలు వేయడానికి ససేమిరా అనే మున్సిపల్ ఉద్యోగులు.. ఏకంగా వేల గజాల స్థలానికి వీల్‌డీడ్‌ను ఆసరాగా చేసుకుని వీఎల్‌టీ వేసిన వైనం విస్మయం కలిగించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలంలో పాత ఇళ్లు.. ఆ ఇళ్లు జాడలేని క్రమంలో సదరు నంబర్లను ఆసరాగా చేసుకుని వీఎల్‌టీలు వేసిన అధికారులు బదిలీల సాకుతో జారుకున్నారు. కోరుట్ల వారసత్వ సంపదను అన్యాక్రాంతం చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా వీఎల్‌టీలు వేసిన అధికారులపై చర్యలకు స్థానిక సంస్థల ఉన్నతాధికారులు ముందువెనకాడిన వైనం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికీ కోట బురుజుల స్థలంలో వీఎల్‌టీలు వేయడంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు ఎందుకు ముందడుగు వేయడం లేదని అఖిలపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
నెల క్రితం సంతకాలు
అఖిలపక్ష నాయకులు తమ నిరసన కార్యక్రమాల్లో భాగంగా మున్సిపల్ నుంచి వేసిన వీఎల్‌టీ రద్దు కోసం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసేందుకు నెల క్రితం కౌన్సిలర్ల సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంతకాల సేకరణలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత సంతకాల ప్రతులను మున్సిపల్ కమిషనర్‌కు సమర్పించి అజెండాలో చేర్చి తీర్మానం ఎందుకు చేయించడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోట బురుజుల స్థలంలో వీఎల్‌టీ రద్దు కోసం కౌన్సిలర్ల సంతకాల సేకరణ పూర్తి చేసిన తరువాత రెండు మున్సిపల్ సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఈ రెండు సమావేశాల్లోనూ కౌన్సిలర్లు గడీ బురుజుల స్థలం గురించి ప్రస్తావన తీసినా ముందుగానే అజెండాలో చేర్చడంపై ఎందుకు ఆసక్తి చూపడం లేదన్న విషయం అంతుచిక్కడం లేదు. ఈ లెక్కన ప్రజలను మభ్యపెట్టేందుకు కౌన్సిలర్లు ఉత్తిత్తి సంతకాలు చేశారన్న అపవాదు వస్తోంది. ఒకవేళ గడి బురుజుల స్థలంలో వీఎల్‌టీ రద్దుకు సంతకాలు చేసిన కౌన్సిలర్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కౌన్సిల్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని ఎందుకు ఒత్తిడి తేవడం లేదన్న విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


