అవినీతి గుబులు | - | Sakshi
Sakshi News home page

అవినీతి గుబులు

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

జగిత్యాల బల్దియాలో పెచ్చుమీరిన అక్రమాలు ఇప్పటికే ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్‌ విచారణ ప్రతి విభాగంలోనూ అవకతవకలే వేటు పడేది ఎవరిపైనో..?

జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకోవడంతో గత డిసెంబర్‌ 18న అటు ఏసీబీ, ఇటు విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేశారు. సుమారు 17 గంటలపాటు తనిఖీలు చేశారు. దాదాపు అన్ని విభాగాల్లోనూ అవినీతి పెచ్చుమీరినట్లు ఆరోపణలు రావడం.. ఏసీబీ, విజిలెన్స్‌ విచారణలోనూ నిజమని తేలడంతో సదరు అధికారులు మున్సిపాలిటీలోని రెవెన్యూ, శానిటేషన్‌, ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లోని ఫైళ్లన్నిటినీ పట్టుకెళ్లారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం పలు శాఖల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తాజాగా కరీంనగర్‌ ప్రాంతీయ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పలు విభాగాల అధికారులను తమ కార్యాలయానికి పంపించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. విజిలెన్స్‌ అధికారుల తుది నివేదిక ఆధారంగా పలువురిపై వేటు పడే అవకాశం ఉందని బల్దియా అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో అనేక అక్రమాలు జరిగినట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. భవనాల కొలతల్లోనూ లోపాలు జరుగుతున్నట్లు స్థానికులు మొత్తుకుంటున్నా.. సదరు అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇదే విషయాన్ని విజిలెన్స్‌ అధికారులు తమ విచారణలో గుర్తించారు. గతంలోనే వచ్చి భవన నిర్మాణ కొలతలు చేపట్టారు. కార్మికుల పీఎఫ్‌, డీఏ చెల్లింపులు పట్టించుకోకపోవడం.. స్టేషనరీ బిల్లులను నమోదు చేయలేదని గుర్తించారు. శానిటేషన్‌ విభాగంలో ట్రేడ్‌ లైసెన్స్‌లు, డీజిల్‌ కొనుగోలులో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి. మున్సిపల్‌ కాంప్లెక్స్‌కు టెండర్లు వేయలేదని నిర్ధారించారు. ఇలా ప్రతి విభాగంలోని ఫైళ్లన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు, అసెస్మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్లు చేసి మరీ తెలుసుకున్నారు. తాజాగా మున్సిపల్‌ అధికారులను పిలిచి విచారించనున్న నేపథ్యంలో ఈసారి వేటు తప్పదని స్థానికంగా చర్చ నడుస్తోంది.

అవినీతికి కేరాఫ్‌ బల్దియా

జగిత్యాల బల్దియాలో మొదటి నుంచే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ భూ కుంభకోణానికి సంబంధించి కమిషనర్‌, ఆర్వో జైలుకెళ్లాడు. టీపీవో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. వసూలు చేసిన ఆస్తిపన్నును సొంతానికి వాడుకున్న ఓ బిల్‌కలెక్టర్‌ సస్పెండ్‌కు గురయ్యాడు. ఇలా అన్ని కీలక శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు వారందరినీ పిలిపించి విచారణ చేపట్టనున్నారు. విచారణ పూర్తికాగానే ఏసీబీ అధికారులు నివేదికను నేరుగా సీడీఎంఏకు పంపిస్తారు. అక్కడ ఆరోపణలు నిజమని గుర్తిస్తే వెంటనే సస్పెండ్‌ చేసే అవకాశం ఉంటుంది.

అధికారుల బదిలీలతో తంటాలు...

ఇటీవల దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులు బదిలీల ప్రక్రియలో భాగంగా ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఇంకా కొన్ని పోస్టులు భర్తీ కాలేదు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, రెవెన్యూ సెక్షన్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది రావాల్సి ఉంది. అయితే సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఇక్కడకు రావడానికి కొందరు జంకుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement