ఆశ చూపి ఉన్నది ఊడ్చేశారు అడిగిన వారిపై బెదిరింపులు ఇచ్చినప్పుడు తీసుకోవాలంటూ హుకూం లబోదిబోమంటున్న వందలాది కుటుంబాలు
ఈయన పేరు నాగరాజు. కూలీ పని చేసి.. దాచుకున్న రూ.5.50 లక్షలు బిట్ కాయిన్ వాళ్లకు ఇచ్చాడు. రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశపడితే ఒక్క రూపాయి రాలేదు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తేగా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు ఆసుపత్రిలో చేర్పించి బతికించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఆ డబ్బులు రాకుంటే చావే గతి అంటున్నాడు నాగరాజు. నాగరాజు, అల్లమయ్యగుట్ట
కోరుట్ల: ఇది ఒకరిద్దరి వ్యథ కాదు.. కోరుట్ల ప ట్టణంలోని అల్లమయ్యగుట్ట కాలనీలో కూలీనాలీ చేసుకుని జీవించే వంద కుటుంబాల దుస్థితి. రెండేళ్ల క్రితం బిట్ కాయిన్ పేరిట పేదల కాలనీల్లో ఆశల చిచ్చు రేపి డబ్బులు కాజేసి జారుకున్న ఏజెంట్ల దాష్టీకం.
పేదరికమే ఏజెంట్ల పెట్టుబడి
రెండేళ్ల క్రితం.. అల్లమయ్యగుట్ట కాలనీలోని పేదల ఆశలను ఆసరాగా చేసుకుని ఒక్కసారిగా ఆర్థికంగా ఎదిగిపోతారని దువ్వ సత్యనారాయణ అనే ఏజెంట్‌తోపాటు మరికొందరు కలిసి పేదలను నమ్మించారు. కూతురు పెళ్లి కోసం.. ఇల్లు కట్టుకుందామ ని, రోగాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చూపించుకుందామని.. పిల్లల చదువుల కోసమని దాచుకున్న డబ్బులను సదరు ఏజెంట్లు చూపిన ఆశకు మోసపోయి వాళ్ల చేతిలో పెట్టారు. వందలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇప్పుడు కంపెనీ డబ్బులు ఇవ్వడం లేదని దబాయిస్తున్న వైనం పేదలను కలచివేస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఏ పని చేసుకోలేక చాలామంది విలవిల్లాడుతున్నారు. ఒక్క అల్లమయ్యగుట్ట కాలనీలో బిట్ కాయిన్ ఏజెంట్లు ఎంత తక్కువనుకున్నా రూ.3 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తాం.. అంటున్న ఏజెంట్ల మాటలకు విసిగిపోయిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారు. దీంతో పోలీసులు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే దిశగా ఏజెంట్లపై ఒత్తిడి తెస్తున్నారు.
ఆస్తులు పోగేసుకున్నారు
బిట్ కాయిన్ ఏజెంట్లు పేదల నుంచి సమకూర్చుకున్న డబ్బులతో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి తమ బంధువుల పేరిట మార్చుకున్నట్లు సమాచారం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఏజెంట్లను పిలిచి విచారిస్తే తాము కంపెనీలో డబ్బులు పెట్టాం.. వచ్చినప్పుడు ఇస్తామని చెబుతూ తప్పించుకు తిరుగుతున్నారు. అల్లమయ్యగుట్ట కాలనీలో ఏజెంట్లుగా చలామణి అయినవారు పేదల డబ్బులు దండుకుని హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు, కోరుట్లలో పలు చోట్లు స్థిరాస్తులు, వ్యాపారాలు సమకూర్చుకుని, ఇప్పుడు తమ వద్ద ఏమీ లేదని తిప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం. తమపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బులు రావని, తాము చెప్పినప్పుడు తీసుకోవాలని పేదలపైనా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారీ కూలీలను కష్టాల ఊబి నుంచి బయటపడతారని నమ్మించి మోసగించిన ఏజెంట్లు దర్జాగా తిరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తమకు ఆశచూపి మోసగించిన సదరు ఏజెంట్లపై పక్కాగా చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు.


