జగిత్యాలకు బైపాస్‌ రోడ్‌ | - | Sakshi
Sakshi News home page

జగిత్యాలకు బైపాస్‌ రోడ్‌

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

జగిత్యాల: జిల్లాకేంద్రానికి బైపాస్‌ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంపీ అర్వింద్‌ తెలిపారు. ఇప్పటికే జగిత్యాల–కరీంనగర్‌ జాతీయ రహదారి అభివృద్ధి పనులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని, అంబారిపేట, అంతర్గాం మధ్య ఫ్‌లైఓవర్‌, అండర్‌ పాస్‌ నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగా అధికారికంగా ప్రకటన చేశారని తెలిపారు. పనులు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. బైపాస్‌ మంజూరవడంపై బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి ఎంపీ అర్వింద్‌కు ధన్యవాదాలు తెలిపారు.

శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ పోరాటం స్ఫూర్తిదాయకం

మెట్‌పల్లి: భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు, దివంగత శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ పోరాటం స్ఫూర్తిదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు అన్నారు. ముఖర్జీ వర్ధంతి వేడుకలను మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని, దానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండకూడదని పోరాటం చేసి ప్రాణాలను అర్పించిన గొప్పనాయకుడు ముఖర్జీ అన్నారు. పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్‌, కౌన్సిలర్‌ బొడ్ల ఆనంద్‌, నాయకులు లింగేశ్వర్‌ తదితరులన్నారు.

ఈవో డ్రైవర్‌ చేతిలో అంజన్న దర్శనం టికెట్లు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఈవో అంజనారెడ్డి వ్యక్తిగత డ్రైవర్‌ స్వామివారి దర్శనం టికెట్లు విక్రయిండంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వెనక ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ఈవో డ్రైవర్‌ టికెట్లు విక్రయించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఏకంగా కౌంటర్‌ వద్ద కూర్చొని టికెట్లు విక్రయించడంపై పలువురు ప్రశ్నించగా.. ఈవో అనుమతితోనేనని సమాధానం చెప్పడం గమనార్హం. ఈ విషయమై ఈవో అంజనారెడ్డిని వివరణ కోరగా.. టికెట్ల విక్రయంతో ఆలయానికి నష్టమేమీ జరగడం లేదని చెప్పడం గమనార్హం. గతంలో హనుమాన్‌ చిన్న జయంతి సమయంలో భక్తులకు లడ్డూల విక్రయాల్లో జాప్యంపై కూడా ఈవో దురుసుగా వ్యవహరించారు. తాజాగా డ్రైవర్‌తో టికెట్లు విక్రయించడంపై పలువురు కలెక్టర్‌తోపాటు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

మత్తు నిర్మూలనకు కృషి చేయాలి

జగిత్యాలక్రైం: మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ అన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై కలిగే అనర్థాలను విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. యువత ఆరోగ్యం, విద్యా భవిష్యత్తు, కుటుంబ సంబంధాలు, సమాజ శాంతిభద్రతలను ప్రభావితం చేస్తాయన్నారు. విద్యార్థులు స్నేహితుల ప్రభావం, తప్పుడు ప్రచారం లేదా ఆసక్తి కారణంగా మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, రవాణా, నిల్వ, విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement