బురుజు స్థలాలను కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

బురుజు స్థలాలను కాపాడుకుందాం

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ● కోరుట్ల మున్సిపల్‌ సమావేశం

కోరుట్ల: కోరుట్ల పట్టణ వారసత్వ సంపదగా వస్తున్న కోట బురుజుల స్థలాన్ని ప్రజలకు చెందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. మంగళవారం కోరుట్ల బల్దియా సర్వసభ్య సమావేశాన్ని చైర్‌పర్సన్‌ తిరుమల వసంత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బురుజు స్థలం అన్యాక్రాంతం కాకుండా కౌన్సిల్‌ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో సరైన రీతిలో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల మ్యాపింగ్‌ ప్రక్రియను సజావుగా చేయాలన్నారు. బల్దియా సమావేశాల్లో కౌన్సిలందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. రాజకీయాల కన్నా ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తానన్నారు.

అందరికీ న్యాయం చేస్తాం: తిరుమల వసంత చైర్‌పర్సన్‌

కౌన్సిల్‌ సభ్యులందరికీ వార్డులను బట్టి న్యాయం చేస్తామని చైర్‌పర్సన్‌ వసంత అన్నారు. వీధి కుక్కుల బెడద నివారణకు రూ.5లక్షలు కేటాయించామన్నారు. నీటి ఎద్దడి నివారణకు అదనంగా ట్యాంకర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు ఇస్తున్నామని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనవసర విషయాలు మాట్లాడి కౌన్సిల్‌ సమయాన్ని వృథా చేయొద్దని హితవు పలికారు. బీజేపీ కౌన్సిలర్లు కస్తూరి లక్ష్మీనారాయణ, ఫ్లోర్‌ లీడర్‌ రుద్ర సుజాత, కౌన్సిలర్లు తిరుమల వాసు, శ్రీకాంత్‌, కలాల రాధ, సోరుపాక రమాదేవి మాట్లాడుతూ.. లేఔట్‌ లేకుండా ప్లాట్లు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కౌన్సిలర్లు పొట్ట సురేందర్‌, వసీం, టేకుల శిరిష తమతమ వార్డుల్లో పలు సమస్యలు ప్రస్తావించి నిధులు మంజూరు చేయాలన్నారు. తోట గంగాధర్‌, రెంజర్ల కల్యాణి మాట్లాడుతూ.. నీటి ఎద్దడి నివారణకు అవసరమైన చోట పైప్‌లైన్లు వేయాలన్నారు. సమావేశంలో కమిషనర్‌ రాఘవేంద్ర, డీఈ అరుణ్‌కుమార్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement