ధర్మపురి: ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మల్, కరీంనగర్ వయా రాయపట్నం మీదుగా రెండు బస్సులను స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ధర్మపురికి వస్తుంటారని, వారి సౌకర్యార్థం నిర్మల్ నుంచి ధర్మపురి వరకు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను నడిపిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటలకు నిర్మల్ నుంచి బయల్దేరి దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, కడెం మీదుగా ధర్మపురికి రోజుకు రెండు ట్రిప్పులు నడుస్తుందన్నారు. ధర్మపురి నుంచి రాయపట్నం, వెల్గటూర్ మీదుగా కరీంనగర్ వెళ్లడానికి మరో బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ చొరవతో నియోజకవర్గంలోని 11 రూట్లలో బస్సుల సౌకర్యం కల్పించామన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ లావణ్య, నాయకులు వేముల రాజు జగిత్యాల, నిర్మల్ డిపోల మేనేజర్లు రమేశ్, పండరీ, ఆర్టీసీ జగిత్యాల సీఐ శ్రీనివాస్ తదితరులున్నారు.
11ఏళ్లకు బస్సు పునరుద్ధరణ
గొల్లపల్లి: మంత్రి చొరవతో 11ఏళ్లకు ఆర్టీసీ బస్సు పునరుద్ధరణకు నోచుకుంది. జగిత్యాల నుంచి వెల్గ టూర్‌కు వయా గొల్లపల్లి, చిల్వకోడూర్, అబ్బాపూర్ మీదుగా బస్సు నడిచేది. 2015లో సర్వీస్‌ను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బస్సు పునరుద్ధరించాలని స్థానికులు మంత్రిని కోరగా.. అబ్బాపూర్‌లో బస్సు సర్వీసును ప్రారంభించారు. అలాగే మూతబడిన పాఠశాల తిరిగి తెరుచుకోగా.. మంత్రి పునఃప్రారంభించారు.


