జగిత్యాలక్రైం: పోలీస్ అధికారులు, సిబ్బందికి వృత్తి నైపుణ్యం అవసరమని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో మూడో పోలీస్ డ్యూటీ మీట్‌ను అదనపు ఎస్పీ చేతన్ నితిన్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. నేర దర్యాప్తు, శాసీ్త్రయ ఆధారాల సేకరణ, కేసుల ఛేదన, ప్రజాభద్రత వంటి అంశాల్లో సిబ్బంది నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలన్నారు. ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ఫొరెన్సిక్ సాంకేతికతపై అవగాహన పెంపొందించేందుకు డ్యూటీ మీట్ వేదికగా నిలుస్తుందన్నారు. కంప్యూటర్, ఫొరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్స్, యాంటీ–సబోటేజ్ చెకింగ్, ఫొటో, వీడియోగ్రఫీ విభాగాల్లో పోటీలు ఉంటాయని, ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది జోనల్ స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. జాతీయస్థాయి డ్యూటీ మీట్‌లో విజేతలకు విశేష గుర్తింపు లభిస్తుందన్నారు. డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు, సీఐలు ఆరిఫ్ అలీఖాన్, సుధాకర్, కరుణాకర్, రవి, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
పెగడపల్లి: అర్హులందరికీ పథకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మీ కింద రూ.9లక్షలు, సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.19.28లక్షల విలువైన చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఇందిరమ్మ పథకం కింద ప్రతి పేదకుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. పెగడపల్లి మండలానికి 499 ఇళ్లు మంజూరు చేశామని, 300పైగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేసుకున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయించి రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని, కీచులాటపల్లి నుంచి ధర్మారం మండలం మల్లాపూర్ వరకు రూ.11 కోట్లు కేటాయించామని వివరించారు. సర్పంచులు ఒరుగల అరుణ, గోపాల్, బలరాంరెడ్డి, లక్ష్మణ్, కుమార్, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, డిప్యూటీ తహసీల్దార్ శిరీషా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి పాల్గొన్నారు.
బాధితుల సమస్యలు పరిష్కారం
జగిత్యాలక్రైం: పోలీస్ గ్రీవెన్స్‌కు వచ్చిన బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. తన కార్యాలయంలో 17 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
సామాజిక అంశాలపై కళాబృందం అవగాహన
రాయికల్: మత్తు పదార్థాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో పోలీసు కళాబృందం అవగాహన సదస్సు నిర్వహించింది. ఎస్సై సుధీర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ తో చదువుకుని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. చెడు అలవాట్లకు లోను కాకుండా భవి ష్యత్‌పై దృష్టి పెట్టాలన్నారు. పోలీసు కళాబృందం సభ్యులు గంజాయి, ఇతర మత్తుపదార్థాల వినియోగంతో కలిగే నష్టాలను ఆటపాటల ద్వారా వివరించారు. ఎంఈవో రాఘవులు, ఉపాధ్యాయులు పొన్నం రమేశ్, రవీందర్, గంగజమున, నాగరాజు, పద్మజ, తిరుమల, వనిత, శ్రీకాంత్, గంగాధర్, కళాబృందం సభ్యులు కమల్, ఇస్లావత్, గడ్డం రమేశ్, హన్మంత్, సతీశ్, సత్తయ్య, లక్ష్మణ్, కాంతయ్య పాల్గొన్నారు.


