జిల్లాలోని 33 రైతువేదికల్లో నేడు ప్రారంభం ఈనెల 30 వరకు అవగాహన కార్యక్రమాలు ప్రైవేట్ కంపెనీ విత్తనాలే అమ్మకాలు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం విత్తన మేళాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆయా పరిశోధన స్థానాల్లో విత్తనమేళాలు ఏర్పాటు చేయగా.. తాజాగా వ్యవసాయ శాఖ ద్వారా రైతువేదికల్లో నిర్వహిస్తోంది. రైతులు ప్రైవేటు కంపెనీల మాయాజాలంలో పడకుండా.. తక్కువ ధరలకు ఇంటి వద్దే విత్తనాలు కొనుగోలు చేసేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వం సన్నరకాలను ప్రోత్సహిస్తుండటంతో ఆ విత్తనాలు మార్కెట్‌లో లభ్యం కావడం లేదనే ఆరోపణలు రాకుండా ఈ విత్తనమేళాలు ఏర్పాటు చేస్తోంది. మేళా అవసరమైన విత్తనాలను ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించనున్నట్లు సమాచారం. ఆ కంపెనీలు నిర్ణయించిన ధరకే రైతు వేదికల్లో విక్రయించే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
నేటి నుంచి ప్రారంభం
జిల్లాలోని 33 రైతు వేదికల్లో విత్తనమేళాలు ఏర్పాటు చేస్తున్నారు. మేళాను ఈ నెల 30 వరకు నిర్వహించనున్నారు. అంబారిపేట, పొలాస, కల్లెడ, కొడిమ్యాల, పూడూరు, మానాల, తాటిపల్లి, బీర్‌పూర్, కండ్లపల్లి, సారంగాపూర్, కోనాపూర్, మన్నెగూడెం, మేడిపల్లి, అల్లీపూర్, కథలాపూర్, ఐలాపూర్, చౌలమద్ది, బండలింగాపూర్, మల్లాపూర్, మొగిలిపేట, ఇబ్రహీంపట్నం, గోదూర్, ధర్మపురి, తిమ్మాపూర్, బుగ్గారం, శెకల్ల, గొల్లపల్లి, ఇబ్రహీంనగర్, పెగడపల్లి, ఎల్లాపూర్, వెల్గటూర్, గుల్లకోట, కొత్తపేట గ్రామాల్లోని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించనున్నారు.
అందుబాటులో సన్నరకాలు
రైతులు సన్నరకాలు సాగు చేయాలని ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచే ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం గుర్తించిన సన్నరకాలను సాగు చేస్తేనే క్వింటాల్‌కు రూ.500 బోనస్ వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గుర్తించిన బీపీటీ– 5204, ఆర్‌ఎన్‌ఆర్–15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటి సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం–1638, కేఎన్‌ఎం–7715, డబ్ల్యూజీఎల్–44 వరి రకాలను రైతులకు అందించనున్నారు. కందులు, మినుములు, కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ విత్తనాలను కూడా రైతువేదికల్లో అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా నానో యూరియా, నానో డీఏపీ వంటివి తెప్పించనున్నారు.


