ఆరుగురి అరెస్ట్.. పరారీలో ఒకరు
సిరిసిల్ల: సులభంగా డబ్బు సంపాదించాలనే దురా శకు వెళ్లిన ఇంటిదొంగలు కటకటాలపాలయ్యారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఆరుగురిని జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడులు రావడంతో రెండు నెలలుగా కొనుగోళ్లు నిరాటంకంగా సాగుతున్నాయి. ఈక్రమంలోనే అక్రమార్కులు వడ్ల గోదాముకే కన్నం వేశారు. 13 లారీల వడ్లను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో గతంలోనూ జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
ఏం జరిగిందంటే..
సిరిసిల్లకు చెందిన ఓ లారీ యజమాని, అతని తమ్ముడు, మరో ఇద్దరు కూలీలతో కలిసి గత సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు పెద్దూరు అపెరల్ పార్క్‌లోని ఓ గోదాములోకి లారీతో వెళ్లారు. సుమారు 150 నుంచి 200 బస్తాలను లారీలో ఎక్కించుకొని నేరుగా కోనరావుపేట మండలం మల్కపేట ఐకేపీ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఆ వడ్లను కొనుగోలు చేసినట్లు ట్రక్‌షీట్ తయారు చేసి మళ్లీ అపెరల్ పార్క్‌లోని గోదాముకే తరలించేందుకు సిద్ధమయ్యారు.
తీగ లాగితే కదిలిన డొంక
అపెరల్‌పార్క్ గోదాములోని వడ్లను దొంగిలించిన ఘటనలో గోదాము మేనేజర్ ఉత్కం విజయ్ ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే 13 లారీల వడ్లను అమ్మిన అక్రమాలు వెలుగుచూశాయి. 86 బస్తాలను దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసిన గోదాం మేనేజర్ విజయ్ అక్రమ ట్రక్‌షీట్లకు, 13 లారీల వడ్లను దారి మళ్లించడానికి కారణకుడని తేలింది. విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు కలిసి రూ.91 లక్షల విలువైన 13 లారీల వడ్లను అమ్మేసినట్లు తేలింది. కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన ఐకేపీ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, మరో సింగిల్‌విండో చైర్మన్ కలిసి నకిలీ ట్రక్‌షీట్‌తో లారీ వడ్లను రైస్‌మిల్లులో దింపకుండానే దింపినట్లు రికార్డులు సృష్టించి వడ్ల సొమ్మును పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ధాన్యం నిల్వలపై అనుమానాలు
జిల్లాలోని 36 రైస్‌మిల్లులకు ధాన్యం అందించారు. మరోవైపు అపెరల్ పార్క్‌లోని 22 గోదాముల్లో వడ్ల ను నిల్వచేశారు. జగిత్యాల జిల్లాకు 14 గోదాములు కేటాయించగా.. రెండు గోదాముల్లో వడ్లను, మరో 12 గోదాముల్లో మక్కలు నిల్వచేశారు. 2024–2025 యాసంగి సీజన్‌లోనూ అపెరల్ పార్క్‌లో నిల్వ చేసిన ధాన్యానికి, తిరిగి రైస్‌మిల్లులకు కేటాయించిన ధాన్యానికి మధ్య 10వేల టన్నులు తేడా వచ్చింది. తాజాగా 13 లారీల వడ్లు పక్కదారి పట్టిన ఘటన చర్చనీయాంశమైంది.
గుమ్మికి ‘ఇంటి దొంగల’ ఎసరు
13 లారీల వడ్లు పక్క దారి
నకిలీ ట్రస్‌షీట్లతో అక్రమాలు
ఆరుగురి అరెస్ట్.. పరారీలో రుద్రంగి ఐకేపీ సెంటర్ ఇన్‌చార్జి
అధికార పార్టీ నేతలను ఆశ్రయించిన అక్రమార్కులు
ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. జూన్ 15న అర్ధరాత్రి సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్ గోదాములోని 86 బస్తాల ధాన్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తున్నారని స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్‌కు చెందిన గోదాము మేనేజర్ ఉత్కం విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా గోదామ్ మేనేజరే మరికొందరితో కలిసి నకిలీ ట్రక్‌షీట్లతో 13 లారీల వడ్లను పక్కదారి పట్టించి సిద్దిపేటలో విక్రయించినట్లు తేలింది.
అందరూ ఇంటిదొంగలే..
గోదాం మేనేజర్, కరీంనగర్‌కు చెందిన ఉత్కం విజయ్, వేములవాడరూరల్ మండలం అచ్చన్నపల్లికి చెందిన వాసాల గణేశ్ కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్‌షీట్లు తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ ఇన్‌చార్జి గడ్డం స్వామి రెండు ట్రక్‌షీట్లు జారీ చేయగా.. గోదాం మేనేజర్ విజయ్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో రైతుల పేరిట వచ్చిన ఆ రెండు లారీల ధాన్యం డబ్బులను ముగ్గురు కలిసి పంచుకున్నారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఆఫీస్‌లో పనిచేసే కుమ్మరి రాజశేఖర్, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పీఏసీఎస్(సింగిల్ విండో) కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి గాజుల నవీన్‌తో కలిసి ఒక్క లారీకి నకిలీ ట్రక్‌షీట్ తయారు చేసి గోదాం మేనేజర్ విజయ్‌కి అందించారు. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంతో రాజశేఖర్ ఆ నకిలీ ట్రక్‌షీట్‌కు ఆమోదం తెలిపారు. రైతుల పేరిట వచ్చిన డబ్బులను ముగ్గురు పంచుకున్నారు.
పది లారీల వడ్లను దారి మళ్లించారు
అపెరల్ పార్క్ గోదాముకు వచ్చిన 10 లారీల వడ్లను అక్కడ దించకుండానే దించినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆ వడ్లను వేములవాడకు చెందిన రైస్‌మిల్లర్ చేపూరి మధుకర్ ద్వారా సిద్దిపేటకు చెందిన కమీషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్‌కు అమ్మేశారు. ఆయన ఆ లారీలను వివిధ రైస్‌మిల్లులకు మళ్లించాడు. పది లారీల వడ్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను నిందితులు పంచుకున్నారు. ఇలా మొత్తం 13 లారీల వడ్లను అమ్మేశారు. ఈ ఘటనలపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహ ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి.. ఉత్కం విజయ్, వాసాల గణేశ్, కమ్మరి రాజశేఖర్, గాజుల నవీన్, చేపూరి మధుకర్, చిటుకుల శ్రీకాంత్‌లను అరెస్ట్ చేశారు. రుద్రంగి ఐకేపీ ఇన్‌చార్జి గడ్డం స్వామి పరారీలో ఉన్నారు.
రూ.14.16 లక్షలు స్వాధీనం..
రూ.46.21 లక్షలు ఫ్రీజ్
ఆరుగురి వద్ద రూ.14.16 లక్షలు, సెల్‌ఫోన్లు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ.46.21 లక్షలను ఫ్రీజ్ చేశామని ఎస్పీ మహేశ్ బీ గీతే వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను చేధించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగరాజు, గణేశ్, హెడ్‌కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రవి, నాగరాజులను ఎస్పీ అభినందించారు.


