ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శుక్రవారం ధర్మపురిలో కలెక్టర్ సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి భూ నిర్వాహితులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఎవరినీ ఇబ్బందులు పెట్టకుండా క్షేత్ర అభివృద్ధికి ముందుకు సాగుతామన్నారు. 2017–18 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాహితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు సీఎం రేవంత్‌రెడ్డి మొదటి విడతగా రూ.117 కోట్లు కేటాయించడం జరిగిందని, వాటితో నియోజకవర్గంలోని ధర్మపురి, కోటిలింగాలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. పుష్కరాలకు ముందే పనులు ప్రారభించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, దేవాదాయశాఖ అధికారులు తదితరులున్నారు.


