కోరుట్ల: మున్సిపాలిటీలోని పట్టణ ప్రణాళిక విభాగంలో ‘అవినీతి కంపు’ కామన్ అన్న తీరుగా తయారైంది. మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణ అనుమతికి ఒక్కో ఫైల్ లెక్కన వసూళ్ల తంతు నడుస్తుంటే.. కోరుట్లలో మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్‌కు కేవలం అమ్యామ్యాలకు కింద రూ.10 వేలతో సరిపెట్టుకోకుండా ఒక్కో అంతస్తుకు ఒక్కో రేటు పెట్టారు. సొంత ఆదాయం మరింత పెంచుకోవచ్చన్న ఆశల్లోకి దిగుతున్నారు. బల్దియాలో వసూళ్ల దందా విచ్చలవిడిగా సాగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
సొంత ఆదాయంపై దృష్టి..
కోరుట్ల మున్సిపాలిటీలో 33వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో ప్రతినెలా ఎంత తక్కువ అనుకున్నా సుమారు 150 నుంచి 200 ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. వీటిలో దాదాపు సగం ఇళ్ల నిర్మాణం జీప్లస్–1 అనుమతి తీసుకోవడం ఆనవాయితీ. గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణానికే రూ.10 వేల మేర అమ్యామ్యాలు తీసుకుని కొంతమంది మున్సిపల్ అధికారులు జేబులు నింపుకుంటున్న విషయం బహిరంగ రహస్యం. మరో అంతస్తు నిర్మాణానికి మరో రూ.5వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడితో సరిపెట్టుకోకుండా ఆపై అంతస్తు నిర్మాణానికి రూ.20వేల నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ లెక్కన మున్సిపాలిటీకి ఇళ్ల నిర్మాణాలపై వస్తున్న ఆదాయం కన్నా సిబ్బందికి ఎక్కువగానే సమకూరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వసూళ్ల దందా మొత్తం మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది ఆర్కిటెక్టర్లతో నడుస్తున్నట్లు తెలిసింది. కాసులు ఎక్కువ మొత్తంలో సమర్పించి ఇంటి నిర్మాణ ఫైళ్లు అందించే లైసెన్స్‌డ్ ఆర్కిటెక్టర్ల అనుమతులు తొందరగా వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారం వ్యవహరించే ఆర్కిటెక్టర్లకు మొండి చేయి చూపుతూ.. లేనిపోని కారణాలు చెబుతూ కొర్రీలు పెడుతుండటం విశేషం.
ఉత్తుత్తి పర్యవేక్షణ
స్థానిక సంస్థలను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు కింది స్థాయి మున్సిపల్ అధికారుల తీరుపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కోరుట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇతర అధికారులపైనా లెక్కలేని ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనక కారణాలు ఏమిటన్న అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం పన్నుల వసూళ్ల అంశంపై ప్రతీరోజు సమీక్షలు నిర్వహించే ఉన్నతాధికారులు మున్సిపాలిటీలో అధికారుల కార్యకలాపాలు సక్రమంగా జరగుతున్నాయా..? లేదా..? అన్న అంశంపై దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


