కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట, చింతకుంట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. ధాన్యం తేమశాతం పరీక్షించిన నిర్వాహకులు తూకం వేశారు. తూకం వేసిన బస్తాలను వాహనాల్లో రైస్‌మిల్లులకు తరలిస్తామంటే రైస్‌మిల్ యజమానులు వద్దని చెప్పినట్లు రైతుల ద్వారా తెలిసింది. దీంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయాయి. రెండు గ్రామాల కేంద్రాల బస్తాలను తరలించేందుకు మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ రైస్‌మిల్ కేటాయించారు. ధాన్యం బస్తాలు ఇప్పుడు తీసుకోమని రైస్‌మిల్ యజమాని చెప్పడంతో నిర్వాహకులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేరే రైస్‌మిల్ కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికై నా పౌరసరఫరాల శాఖ అధికారులు చొరవ చూపి ధాన్యం బస్తాలు తరలింపు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


