పంటల రక్షణపై దృష్టి సారించాలి
జగిత్యాలరూరల్: రైతులు పంటల సంరక్షణపై దృష్టి సారించాలని శాస్త్రవేత్త పి.స్పందనభట్ అన్నారు. సారంగాపూర్ రైతువేదికలో పొలాస వ్యవసాయ పరిశోధనస్థానం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు వాతావరణ సూచనలు, పంటల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. భారత వాతావరణ విభాగం అందిస్తున్న ముందస్తు సమాచార సేవలు, ప్రాముఖ్యతను వివరించారు. పంటల సాగులో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందస్తు అంచనా ఎంతో అవసరమన్నారు. ఐదు రోజుల ముందస్తు వాతావరణ సూచనలు వాటికి అనుగుణంగా వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు అందించే మెఘాదూత్ మొబైల్ యాప్‌ను రైతులు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. వరి, మొక్కజొన్న, నువ్వుల పంటల సాగులో పాటించాల్సిన సాంకేతిక సూచనలు, సమతుల్య ఎరువుల వినియోగం, సమయానుకూల కలుపు నివారణ, చీడపీడలు, తెగుళ్ల సమగ్ర యాజమాన్యంపై వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీలక్ష్మీ, రామకృష్ణ, స్వాతి, సుమలత, ఏఈవో వెంకటేశ్, సర్పంచ్ శేఖర్‌యాదవ్, రైతులు పాల్గొన్నారు.


