అక్క గెలుపు.. తమ్ముడు ఓటమి
యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ పరిధి వెంకట్రావుపల్లి 15వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బుర్ర శశికళ–ముత్యాలగౌడ్ విజయం సాధించారు. ఆమె తమ్ముడు దాసరి శ్రీనివాస్ 18వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థిపై 376 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
హ్యాట్రిక్ విజయం
మెట్‌పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 18వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీలో నిలిచిన చెట్లపల్లి మీనా వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2014, 2020 ఎన్నికల్లో కూడా మీనా ఈ వార్డు నుంచి గెలుపొందారు. ప్రస్తుతం మరోమారు విజయం పొంది మున్సిపల్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి కౌన్సిలర్‌గా రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో 10 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ ముందంజ వేసింది. మీనా ఆ పార్టీ నుంచి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు.
మూడుసార్లు..
జగిత్యాల: జగిత్యాల 21వ వార్డు కౌన్సిలర్ సిరికొండ పద్మ హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గతంలో బీఆర్‌ఎస్ నుంచి 3వ వార్డులో పోటీ చేసి గెలుపొందగా.. రెండోసారి బీఆర్‌ఎస్ తరఫునే 17వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి 21వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం పొందారు.
కోరుట్ల విశేషాలు..
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని 31వ వార్డులో పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు రాలేదు.
ఒక్క ఓటు..
పట్టణంలోని 32, 24, 17, 12 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. వీరు తమ ఓటు తాము వేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.
అత్యధిక మెజార్టీ..
పట్టణంలోని 25 వార్డులో బీజేపీ అభ్యర్థి కలాల రాధకు అత్యధిక మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ కవితపై 660 ఓట్ల మెజార్టీ వచ్చింది. అత్యల్పంగా 3వ వార్డు అభ్యర్థి మోర్తాడ్ లక్ష్మీనారాయణ 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి దొబ్బల వెంకటేశ్ రెండో స్థానంలో నిలిచారు.
భార్య గెలుపు.. భర్త ఓటమి
గత మున్సిపల్ ఎన్నికల్లో 10, 11 వార్డుల్లో పోటీ చేసిన దాసరి రాజశేఖర్–సునీత దంపతుల్లో రాజశేఖర్ ఓటమిపాలు కాగా.. సునీత గెలిచింది. ఈసారి కూడా రాజశేఖర్ పరాజయం పాలవ్వగా.. సునీత విజయం సాధించింది.
పెళ్లి కాని కౌన్సిలర్
28వ వార్డులో కొక్కెర వెంకటేశ్ బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు. ఈయనకు 25 ఏళ్లు. పెళ్లి కాలేదు.


