టికెట్ దక్కకున్నా.. ప్రజామోదం దక్కింది..
జగిత్యాలటౌన్: టికెట్ దక్కకపోయినా ప్రజామోదం మాత్రం దక్కింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాలు వెలువడ్డాయి. 22వ వార్డులో బీజేపీ టికెట్ ఆశించిన అరవ లక్ష్మి(బిట్టు)కి టికెట్ రాకపోవడంతో.. పార్టీ నాయకులకు ఫోన్ చేసిన లక్ష్మి కుమారుడు బోరున విలపించాడు. అనంతరం లక్ష్మి రెబల్‌గా బరిలోకి దిగారు. స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఘన విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 26వ వార్డులో బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమకు చివరి నిమిషంలో టికెట్ దక్కక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె కుమారుడు శ్రీధర్ బోరున విలపిస్తూ పార్టీ నేతలకు ఫోన్ చేసి తానేం పాపం చేశానని నిలదీశాడు. రెబల్‌గా బరిలోకి దిగి ప్రజామోదంతో గెలుపొందారు. తల్లులకు టికెట్లు రాక ఆవేదనకు లోనైన వారి కుమారులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఇద్దరూ ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించడం జగిత్యాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ టికెట్ కంటే ప్రజాభిమానమే గొప్పదని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయని చర్చించుకుంటున్నారు.
టికెట్ దక్కకున్నా.. ప్రజామోదం దక్కింది..


