లేబర్‌కోడ్‌లు రద్దు చేయాల్సిందే..
జగిత్యాలటౌన్: కార్మికులను బానిసలుగా మార్చేలా కేంద్రప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు, రైతులు, వివిధ రంగాల ఉద్యోగులు గురువారం జిల్లాకేంద్రంలోని టౌన్ హాల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లేబర్‌కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ వర్కర్స్, వీవోఏ, ఆర్పీ తదితర వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ కల్పిస్తూ సమగ్ర చట్టం తేవాలని పేర్కొన్నారు. ముఠా, ఆటో, బిల్డింగ్, గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, కౌలురైతుల గుర్తింపు, ఉపాధి పఽథకాన్ని పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తూ 200పనిదినాలు కల్పించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందూరి సులోచన, కోమటి చంద్రశేఖర్, ఏఐటీయూసీ నాయకులు ముఖ్రం, వెన్న మహేష్, మునుగూరి హన్మంతు, శ్రీగాధ దేవదాసు, కోరుకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమ్మెకు ఐఎన్‌టీయూసీ, టీయూసీసీ, ఓఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ మద్దతు ప్రకటించాయి.
సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాల నాయకులు


