మున్సిపోల్స్‌.. అందని పల్స్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌.. అందని పల్స్‌

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

మున్సిపోల్స్‌.. అందని పల్స్‌

మున్సిపోల్స్‌.. అందని పల్స్‌

జగిత్యాల: మున్సిపల్‌ పోరు ఈసారి రసవత్తరంగా సాగింది. పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థులు అంచనాల్లో మునిగితేలుతున్నారు. లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. జగిత్యాలలో వింతపోరు నడిచింది. అధికార పార్టీ కాంగ్రెస్‌కు రెబల్స్‌ అత్యధికంగా ఉండటం.. ఇక్కడ జీవన్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌ మధ్య పోటీ నెలకొన్నట్లయ్యింది. వారం పాటు ప్రచారం కొనసాగించి.. డబ్బులు, మందు, విందుల ద్వారా ప్రలోభాలకు గురిచేసినా అభ్యర్థుల్లో గెలుస్తామన్న ధీమా లేకుండా భయాందోళనలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో భవితవ్యం తేలనుండటంతో గెలుపు ఓటములు లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థులు ఎన్నికలు పూర్తయిన అనంతరం నిద్రలేకుండానే గడుపుతున్నారు. ఓడుతామో, గెలుస్తామోనన్న భయాందోళన వెంటాడుతోంది. ఇప్పటికే భవితవ్యం బ్యాలెట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తం కాగా.. ఓటరు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.

జగిత్యాలవైపే అందరి చూపు

జగిత్యాల మున్సిపల్‌ పీఠంవైపే అందరి దృష్టి పడింది. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అంచనాకు వచ్చినప్పటికీ ప్రజాప్రతినిధులు అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. కాలనీల్లో ఎన్ని ఓట్లు పడే అవకాశాలున్నాయో అంచనా వేసుకుని ఓటరు జాబితాను ముందు పెట్టుకుని లెక్కలు వేసుకుంటున్నారు. జగిత్యాలలో ఎప్పుడూ అధికార, ప్రతిపక్షం మధ్య పోటీ జరిగేది. కానీ.. ఈసారి అధికార పక్షంలోనే రెబల్‌గా పోటీ జరిగినట్లయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరడం.. అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఇవ్వడంతో జీవన్‌రెడ్డి వర్గీయులు తీవ్రంగా మండిపడ్డారు. బీఫాంల విషయంలో ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వడంతో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీని పక్కన పెట్టిన సీనియర్‌ అభ్యర్థులు ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగారు. ఒకానొక దశలో తీవ్రమైన పోటీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అభ్యర్థులకు ప్రచారం చేయగా.. జీవన్‌రెడ్డి ఏకంగా తన వర్గీయులైన స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేశారు. దీంతో ఇక్కడ పోటీ విచిత్రంగా మారింది. అలాగే బీఆర్‌ఎస్‌, బీజేపీ సైతం వీరి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

అప్పుల కుప్పలే

ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న కొందరు అభ్యర్థులు కౌన్సిలర్‌ పదవి దక్కించుకోవాలని విపరీతంగా ఖర్చు చేశారు. విచ్చలవిడిగా నగదు, మద్యం ఏరులై పారించారు. ఓ వార్డులో ఒక అభ్యర్థి రూ.50లక్షలకు పైగా ఖర్చు పెట్టాడంటే దీనిని బట్టి పోటీ ఎంతలా జరిగిందో తెలుస్తుంది. అభ్యర్థులు లక్షల్లో అప్పు చేయడంతోపాటు, భూములను తనఖా పెట్టారు.

చైర్మన్‌ పీఠం కోసం పోటీ

జగిత్యాల చైర్మన్‌ పీఠం బీసీలకు రావడంతో దానిపై ఇప్పటినుంచే కన్నేశారు. ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. చైర్మన్‌ పీఠం ఆశించే వారు ఒకానొక దశలో సొంత పార్టీ వారే చైర్మన్‌ స్థానంలో పోటీ పడుతున్న వారికి ఒకరినొకరు రెబల్స్‌కు డబ్బులు ఇచ్చుకుంటూ ఓడించే ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఇండిపెండెంట్ల హవా ఉన్నట్లు కన్పిస్తుండటంతో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎలా వెళ్దాం..? ఏం చేద్దాం..? అనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఇండింపెండెంట్ల హవా ఎక్కువగా ఉంటే అటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మద్దతిచ్చే అవకాశం ఉంటుంది.

ఎవరికి వారే అంచనాలు

అనుచరులతో అభ్యర్థుల సమావేశాలు

చైర్మన్‌ పదవిపై ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement