మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు
వేములవాడ: ఈనెల 14 నుంచి భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. తన కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. రూ.1.96 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జాతరకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2.50 లక్షల వరకు లడ్డూ ప్రసాదాలు సిద్ధమని తెలిపారు. భక్తు ల నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేశామని, రాజన్న జలప్రసాదం ఆరు ప్రధాన కేంద్రాలు, 30 ప్రాంతాల్లో అందుబాటులో ఉంచడమే కాకుండా ట్రాలీ ఆటోల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు వివరించారు. దాతల సహకారంతో లక్ష వరకు మజ్జిగ పాకెట్లు, టిఫిన్లు భక్తులకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 15న ఉదయం 8 గంటలకు ప్రభుత్వం తరఫున, 14న సాయంత్రం 7 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 14 నుంచి 16 వరకు శివార్చన వేదికపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కొనసాగుతాయని వివరించారు. 87369 36969 నంబర్‌కు ‘ఏజీ’ అని మెసేజ్ చేయడం ద్వారా ఆలయ సేవల వివరాలు పొందవచ్చని తెలిపారు.
ఈవో రమాదేవి


