బ్యాలెట్ బాక్స్‌ల్లో భవితవ్యం
పోలింగ్ ముగిసింది.. ఫలితం మిగిలింది ప్రధానంగా కాంగ్రెస్, రెబల్స్ మధ్యే పోటీ జగిత్యాలలో వింత పరిస్థితి అందరిచూపు ఇటువైపే..
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు జగిత్యాల వైపే పడింది. బ్యాలెట్ బాక్స్‌లు తెరిస్తే.. ఫలితాలు ఎటు వైపు ఉండబోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడ నెలకొన్న పరిస్థితుల క్రమంలో హంగ్ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. జగిత్యాలలో 50 వార్డులు ఉండగా.. అధికార కాంగ్రెస్ బీఫామ్ గొడవతో రెండుగా చీలిపోయింది. ఈ అవకాశాన్ని ఇటు బీజేపీ, అటు బీఆర్‌ఎస్ అభ్యర్థులు అందిపుచ్చుకున్నారు. బీఫామ్ విషయంలో కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడైన జీవన్‌రెడ్డికి 15 కేటాయించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని కాంగ్రెస్ వైపున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు 35 సీట్లు కేటాయించారు. ఇక్కడే విభేదాలు భగ్గుమన్నాయి. జీవన్‌రెడ్డి వర్గీయులు 50 మందిలో 15 మంది కాంగ్రెస్ తరుఫున పోటీ చేసినప్పటికీ మిగతా 35 స్థానాల్లో రెబల్స్ పోటీచేశారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గానే మారింది. 50 స్థానాల్లో ఎమ్మెల్యే వర్గీయులు, 50 స్థానాల్లో జీవన్‌రెడ్డి వర్గీయుల మధ్య పోటీ జరిగినట్లయ్యింది. దీనిని అందిపుచ్చుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్ కొంతమేర పుంజుకున్నట్లు తెలుస్తోంది.
వణికిస్తున్న ఎయిర్ కండిషనర్
కాంగ్రెస్ రెబల్స్‌గా పోటీచేస్తున్న అభ్యర్థులకు ఒకరిద్దరు మినహా దాదాపు అందరికీ ఎయిర్ కండిషనర్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుగల అభ్యర్థులు మార్మోగించారు. ప్రతి వార్డులో వీరు గట్టి పోటీ ఇచ్చారు. జీవన్‌రెడ్డి వర్గీయులు చాలామందికి ఈ గుర్తు రావడంతో ఆయనే స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది.
పంపకాల పర్వం
అధికార కాంగ్రెస్.. రెబల్స్ మధ్య అత్యధిక పోటీ నెలకొనడంతో ఓ వైపు పోలింగ్ ప్రారంభమైనా కొన్ని వార్డుల్లో పంపకాలపర్వం కొనసాగింది. రెండురోజుల క్రితమే ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఇవ్వడంతోపాటు మద్యం, చీరలు, వెండి కుంకుమభరిణిలు పంపిణీ చేశారు. ఎక్కువగా కాంగ్రెస్ రెబల్స్‌కు ముందుకు సాగుతున్నట్లు వార్తలు రావడంతో మళ్లీ పంపకాల పర్వం మొదలుపెట్టారు. దాదాపు ప్రతి చోట రూ.2 వేలు ఇస్తే మరో అభ్యర్థి రూ.3 వేలు ఇచ్చినట్లు సమాచారం. ఒక వార్డులోనైతే ఓ అభ్యర్థి రూ.50లక్షల మేరకు ఖర్చు పెట్టగా అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి తక్కువ ఖర్చు చేసినప్పటికీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలిసింది.
చైర్మన్ అభ్యర్థులకూ రెబల్స్
చైర్మన్ అభ్యర్థులకూ రెబల్స్ బెడద నెలకొంది. అధికార కాంగ్రెస్‌లోనే చైర్మన్ సీటును ఆశిస్తున్నవారు రెబల్స్‌ను పెట్టి ఎదుటివారిని ఓడించే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్కడ పోటీ చేస్తున్న ప్రత్యర్థులకు వీరే డబ్బులు సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు చైర్మన్ సీట్లు ఆశిస్తున్న ముగ్గురు ఒకరినొకరు ఓడించుకునే ప్రయత్నించినట్లు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది.
పుంజుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వైపు రావడంతో ఆ పార్టీకి క్యాడర్ లేకుండా పోయింది. అయినా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, ఎల్.రమణ ఆధ్వర్యంలో అన్ని స్థానాల్లో పోటీచేయగా.. చాలా స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి గతంలో ఐదు సీట్లు రాగా.. ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
భిన్నమైన ఫలితాలు
జగిత్యాలలో భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పాలకవర్గాలు కొనసాగాయి. గత ఎన్నికల్లో మాత్రం బీఆర్‌ఎస్ గెలుచుకుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి అనుకూల పవనాలు వీచినా.. ఇద్దరు నేతల మధ్య గొడవతో భిన్నమైన ఫలితాలు నెలకొనే అవకాశాలున్నాయి.


