వణికిస్తున్న రెబెల్స్..
జగిత్యాల: ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో రెబల్స్ గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీలో వింత పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నుంచి టికెట్లు ఇప్పించుకుని.. కాంగ్రెస్‌లో చేరకుండా.. ఎప్పుడూ పార్టీ కండువా కొప్పుకోని వారి తరఫున ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రులుగా మారిన వారి తరఫున కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రచారం చేశారు. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అందరిచూపు జగిత్యాలపై పడింది. మొత్తంగా జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికలు ప్రధానంగా జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కమార్ మధ్యే అని చెప్పవచ్చు. సంజయ్ వర్గం నుంచి 50 మంది.. జీవన్‌రెడ్డి వర్గం నుంచి 50 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌లో దొంగలు పడ్డారని, ఈ వయస్సులో తన గొంతు కోశారని, కాంగ్రెస్ జెండా మోసిన వారే ఇప్పుడు కానివారయ్యారని, వారు స్వతంత్రులుగా మారాల్సి వచ్చిందంటూ జీవన్‌రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏనాడూ కాంగ్రెస్ జెండామోయకున్నా.. టికెట్ తెచ్చుకున్న వారిని ఓడించాలని, పార్టీ కష్టకాలంలో తోడుంటూ.. ఇప్పుడు టికెట్ రాకున్నా బరిలో ఉన్న వారిని గెలిపించాలని ప్రచారం చేశారు. అటు సంజయ్‌కుమార్ కూడా అభివృద్ధే తన ధ్యేయమని, ప్రభుత్వంతో కలిసి వెళ్లేవారికే ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థించారు. ఇక్కడ విశేషమేమంటే.. జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు జగిత్యాలలో మాత్రం ఇక్కసారి కూడా ప్రచారం చేయలేదు. ఇప్పటివరకు జగిత్యాలకు కనీసం ఇన్‌చార్జి మంత్రి రాకపోవడం కూడా గమనార్హం. దీంతో అటు ప్రతిపక్షానికి.. ఇటు అధికారపక్షానికి రెబల్స్ బెడద పొంచి ఉంది.
శ్రమిస్తున్న నేతలు
ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు గట్టిగానే శ్రమిస్తున్నారు. లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయే వరకూ వార్డుల్లో కలియ తిరుగుతున్నారు. మెజార్టీ స్థానాల్లో గెలుపుదిశగా ప్రయత్నాలు చేశారు. గతంలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 30 మంది.. ప్రస్తుతం ఎమ్మెల్యే వైపే ఉన్నారు. వారందరూ ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీచేసి ఓడిపోయిన వారికి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేయాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం గట్టిపోటీ ఇస్తుడడం.. పోలింగ్‌కు ఒక్కరోజే మిగిలి ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
పట్టణ ఓటర్లు ఎటువైపో..?
గ్రామీణ ప్రాంత ఓటర్లు ప్రలోభాలకు మొగ్గు చూపినప్పటికీ పట్టణాల్లో మాత్రం కొద్దిగా విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఏ అభ్యర్థికి ఓటు వేయాలి..? ఎలా వేయాలి..? అవగాహన ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఇప్పటికే గమనిస్తున్నారు.


