ప్రజలంతా బీఆర్‌ఎస్ వైపే..
ఎమ్మెల్సీ ఎల్.రమణ జగిత్యాల, రాయికల్‌లో ముమ్మర ప్రచారం బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విన్నపం
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల్లో ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఓటర్లను అధికార పార్టీ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా బీఆర్‌ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో మిరాకిల్ జరగబోతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే జగిత్యాల, రాయికల్ అభివృద్ధి చెందాయని వివరించారు. జిల్లాకేంద్రంతోపాటు అన్ని రకాల వసతులు కల్పించామని పేర్కొన్నారు. ముందుగా ఆయన జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ముమ్మర ప్రచారం చేశారు. ప్రశ్నించే గొంతుకలకు ప్రజలు పట్టంగట్టబోతున్నారని తెలిపారు. పేదల వైద్యం కోసం మెడికల్ కళాశాల ఏర్పాటు, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు పట్టణ సుందరీకరణలో భాగంగా జంక్షన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. శ్మశాన వాటికలు, డివైడర్లు ఏర్పాటయ్యాయన్నారు.
ఓటును రాయికల్‌లో వినియోగిస్తా..
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీని రూ.25కోట్లతో అభివృద్ది చేసిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్సీ రమణ అన్నారు. పట్టణంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి రూ.25 కోట్లు వెచ్చించి ప్రతి వార్డులో వసతులు కల్పించామని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్‌ఎస్‌లో ఉన్నానంటూ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల హామీలకు మాత్రమే బీజేపీ పరిమితమని ఎద్దేవా చేశారు. రాయికల్ మున్సిపల్ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని తెలిపారు. తన ఓటు హక్కును రాయికల్‌లోనే వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీమంత్రి రాజేశంగౌడ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కట్కం రవి తదితరులు పాల్గొన్నారు.


