బాల్యానికి భరోసా
● అక్షరాలు దిద్దాల్సిన బాల్యం పనుల్లో.. ● ఆపరేషన్ స్మైల్‌లో 37 మంది గుర్తింపు ● పనిలో పెట్టుకున్న ఐదుగురిపై కేసు నమోదు
మెట్‌పల్లిరూరల్: పాఠశాలకు వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన వయస్సులో చిన్నారులు బాలకార్మికులుగా మగ్గిపోతున్నారు. బాల్యం నుంచే వయస్సుకు మించి పనులు చేస్తున్న చిన్నారుల జీవితం దుర్భరంగా మారి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, దుకాణాలు, ఇతరత్రా వ్యాపార సముదాయాల్లో బాలకార్మికులుగా కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏటా పోలీసులు పలు శాఖలను సమన్వయం చేసుకుని ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో చిన్నారులకు విముక్తి లభిస్తోంది.
37 మంది బాలకార్మికులకు విముక్తి..
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని జనవరి ఒకటి నుంచి 31 వరకు నిర్వహించిన అధికారులు.. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నెలరోజులపాటు జరిగిన ఈ కార్యక్రమం కోసం పోలీస్‌శాఖ ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. ఇందులో చైల్డ్ వెల్ఫేర్, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వాములై చర్యలు చేపట్టారు. ప్రైవేట్ వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించగా.. వేర్వేరు ప్రాంతాల్లో 37 మంది బాలకార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బాల కార్మికులను పనిలో పెట్టుకున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భరోసా కలిగేలా..
బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్న అధికారులు తల్లిదండ్రులు లేనివారిని రక్షణ గృహాలకు తరలిస్తున్నారు. మిగతా వారిని పాఠశాలల్లో చేర్పించడం, తల్లి దండ్రులకు అప్పగించడం, కౌన్సెలింగ్ వంటివి చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఏటా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ స్మైల్‌తో ఎంతో మంది బాలకార్మికులకు విముక్తి లభిస్తోందని, వారికి భరోసా ఇస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలి
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి. ఎక్కడైనా వ్యాపార సముదాయాల్లో చిన్నారులను పనిలో పెట్టుకున్నట్‌లైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. బాలలను పనిలో పెట్టుకోవడం నేరం. చిన్నారులను పనిలో పెట్టుకున్న వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం.
– కిరణ్‌కుమార్, ఎస్సై, మెట్‌పల్లి


