పుర ఓటర్లు @ 2,31,580
జగిత్యాల: సంక్రాంతి పండగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే సోమవారం తుది ఓటరు జాబితా ప్రకటించారు. ఈ లెక్కన జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2,31,580 ఓటర్లున్నారు. ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీలో ఓటరు జాబితాను ప్రచురించారు. ఈనెల 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రతి వార్డుల్లో 1800కు తగ్గకుండా.. 2000కు మించకుండా ఓటర్లను కేటాయించి ఎలాంటి తప్పులు లేకుండా సవరణలు చేపట్టారు. ఈనెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో జిల్లాలో సందడి నెలకొంది. పోలింగ్ కేంద్రాల వివరాలు, ముసాయిదా జాబితాను ప్రచురించి టీ పోల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఆశావహుల్లో సందడి
మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆశావహులు సన్నాహాలు మొదలుపెట్టారు. కాలనీల్లో ప్రస్తుతం పరోక్షంగా ప్రచారం చేపడుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తాయో లేదో అన్న భయం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు టికెట్ల కోసం ఇప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాగైనా కౌన్సిలర్ పదవిలో కూర్చోవాలని చూస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లే ఎలా ఉంటాయోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటినుంచే ఐదు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. గతంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు పదేళ్లు వర్తింపజేస్తూ చట్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వచ్చాక దానిని ఎత్తివేసి పంచాయతీ ఎన్నికల్లో రొటేషన్ పద్ధతిలో ఎన్నికలు చేపట్టింది. మున్సిపాలిటీలో పా త రిజర్వేషన్ల ప్రకా రమా..? రోటేషన్ పద్ధతా..? అన్నది తెలి యాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఓటరు జాబితా రూపొందించి విడుదల చేశారు.
రిజర్వేషన్లపై ఆసక్తి
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. ప్రధానంగా రిజర్వేషన్లపైనే ఆసక్తి నెలకొంది. కౌన్సిలర్ పదవిపై కన్నేసిన నాయకులు ఎలాగైనా దక్కించుకో వాలని చూస్తున్నప్పటికీ రిజర్వేషన్లపై లెక్కలేసుకుంటున్నారు. కలిసి రాకపోతే పతుల స్థానంలో సతులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా అనుకూలించకపోతే ఇతర వార్డులకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇది పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. జిల్లాలో ప్రతి పార్టీ తరఫున అభ్యర్థులు గట్టి పోటీగానే ఉన్నారు. కొన్ని పార్టీలు ఇప్పటికే సర్వే చేస్తుండగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా చూస్తున్నారు. జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీలు అయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌లో కాంగ్రెస్ పాగా వేయాలని చూస్తుండగా గతంలో బీఆర్‌ఎస్ సైతం పలు మున్సిపాలిటీలను దక్కించుకున్న నేపథ్యంలో ఈ సారి కూడా కై వసం చేసుకోవాలని చూస్తోంది.
బల్దియా వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
జగిత్యాల 50 46,039 48,742 19 94,800
మెట్‌పల్లి 26 22,283 23,917 1 46,201
కోరుట్ల 33 30604 32901 2 63507
ధర్మపురి 15 6701 7284 3 13,988
రాయికల్ 12 6157 6927 0 13084
మొత్తం 136 1,11,784 1,19,771 25 2,31,580


