నాలుగోసారైనా కలిసి వచ్చేనా..!
● మెట్‌పల్లి మున్సిపాలిటీకి మూడుసార్లు ఎన్నికలు
● చైర్మన్ పీఠం వరుసగా మహిళలకే కేటాయింపు
● ఈసారైనా కలిసి రావాలని కోరుకుంటున్న నాయకులు ● మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మెట్‌పల్లిని మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2004లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు.
● ఆ సమయంలో వైఎస్సార్ సొంత నియోజకవర్గమైన పులివెందులతోపాటు మెట్‌పల్లిని మాత్రమే మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడం గమనార్హం.
● ఈ మున్సిపాలిటీకి మొదటిసారి 2005లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీసీ మహిళకు చైర్మన్ పదవిని రిజర్వ్ చేశారు.
● 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆ సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు నిర్వహించడం సాధ్యం కాలేదు.
● తర్వాత 2014లో రెండోసారి నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.
● 2020లో మూడోసారి జరిగిన ఎన్నికల్లో చైర్మన్ పదవి మరోమారు బీసీ మహిళను వరించింది.
● వరుసగా మూడు పర్యాయాలు చైర్మన్ పదవిని మహిళలే అలంకరించడంతో ఈసారి రిజర్వేషన్ తమకు తప్పకుండా కలిసివస్తుందని ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న పురుష నాయకులు అంచనా వేస్తున్నారు.
● కొందరు ముఖ్యనేతలు చైర్మన్ రిజర్వేషన్ కలిసి వస్తేనే కౌన్సిలర్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకుంటుంటే.. మరికొందరు అవసరమైతే తమ సతీమణులను రంగంలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు.
● పురుషులకు అనుకూలంగా రిజర్వేషన్ కలిసి వస్తే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల్లో పోటీ తీవ్రంగా ఉండే అవకాశముంది. దీంతో ఆయా పార్టీల పెద్దలు అంగబలం, అర్థికబలం ఉన్న నేతలను పోటీలో దించడానికి మంతనాలు జరుపుతున్నారు.
మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం రిజర్వేషన్‌పై పలువురు నాయకులు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఈసారి రిజర్వేషన్ తమకే తప్పకుండా కలిసివస్తుందని భావిస్తున్న వారు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెట్‌పల్లి మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో చైర్మన్ పీఠం మహిళలకే రిజర్వ్ చేశారు. ప్రతిసారి పీఠంపై ఆశలు పెట్టుకున్న పురుష నేతలకు నిరాశే ఎదురైంది. ఈసారి పురుషులకే అనుకూలంగా రిజర్వేషన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అధికారులు ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముండడంతో ఆశావహులంతా వాటి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
వైఎస్ హయాంలో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్
రిజర్వేషన్‌పై ఆశలు