అభివృద్ధి చేతల్లో కనిపించాలి
ధర్మపురి: అభివృద్ధి అనేది మాటల్లో చెప్పేది కాదని, చేతల్లో చూపించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అనడం సరికాదన్నారు. ధర్మపురిని మున్సిపాలిటీగా చేశామని, పట్టణానికి కోర్టు తెచ్చామని వివరించారు. రూ.30లక్షలతో ముస్లింలకు షాదీఖానా కట్టించామన్నారు. రూ.9కోట్లతో 50 పడకల మాతాశిశు ఆసుపత్రి నిర్మించామని తెలిపారు. పట్టణంలోని ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుండి 50 పడకలకు పెంచామని, డయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించామని చెప్పారు. పట్టణంలో రెండు బస్తీ దవాఖానాలు, వెటర్నరీ ఆస్పత్రి నిర్మించామని, సొంత డబ్బులు రూ.22లక్షలు వెచ్చించి అంబులెన్స్ అందించానని గుర్తు చేశారు. పోలీస్‌స్టేషన్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, గాంధీ చౌరస్తా, రూ.4కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, చింతామణి చెరువు సుందరీకరణ, తమ్మల్లకుంట ఆధునీకరించామని పేర్కొన్నారు. న్యూ టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా 66 గదులు, ఎస్టీ హాస్టల్ నిర్మించామని తెలిపారు. డిగ్రీ కళాశాలను కూడా తెచ్చామని వివరించారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, దొంతాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించినట్లు పేర్కొన్నారు. కుల సంఘాల భవనాలు 90 శాతం పూర్తి చేశామని, 13 లిఫ్టుల నిర్మాణం పూర్తి చేశామని, ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. యువతను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే రోలింగ్ క్రికెట్ కప్ నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు మంత్రి ఉంటున్న క్యాంపు కార్యాలయాన్ని రూ.1.50 కోట్లతో పూర్తి చేశామని, కార్యాలయం ముందు హైవే నిర్మించామని వివరించారు. ఇవన్నీ మంత్రికి కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకొచ్చిన రెండేళ్లలో మంత్రి చేసిన అభివృద్ధి ఏదని, కనీసం మాతాశిశు ఆస్పత్రిని కూడా ప్రారంభించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మండల కన్వీనర్ అయ్యోరి రాజేశ్, పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


